ఇంటి పంటతో కాస్త మంచి వంట వండుకుందామని కొత్త ప్రయాణం మొదలుపెట్టిందామె. ఒక్కో మొక్కా చేరుతూ ఆమె ఇంటి టెర్రస్ ఉద్యానవనమైంది. ఆ మొక్కలను పెంచుతూ ఫలాలే కాదు అనుభవాలూ గడించింది. సేంద్రియ సాగులో నేర్చుకున్న పాఠాల్ని నలుగురితో పంచుకుంటున్నది. సోషల్ మీడియాలో మొదలై మిద్దెతోట మీట్ దాకా ఎలిజబెత్ కోట ప్రయాణం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. ఇంటి పంట ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్న ఎలిజబెత్ కోట ప్రస్థానం ఆమె మాటల్లోనే..
మా నాన్న టీచర్ ఉద్యోగం చేస్తూనే వ్యవసాయం చూసుకునేవాడు. అలాగే మా ఇంటి పెరటిలో కూరగాయలు, పండ్ల మొక్కలు నాటేవాడు. వాటిని శ్రద్ధగా పెంచేవాడు. నాన్న వెనుక నిలుచుని, ఆయన చేసే పనులు గమనిస్తూ ఉండేదాన్ని. మా పెరటిలో కాసిన పండ్లు భలే రుచిగా ఉండేవి. ఆ రుచి ఒక మధుర జ్ఞాపకంగా ఉండిపోయింది. పెరిగిన వాతావరణం వల్ల చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ ఇష్టం.
ఆరేండ్ల క్రితం నాగారం (హైదరాబాద్)లో ఇల్లు కొనుక్కున్నాం. సొంతిల్లు కాబట్టి పురుగు మందులు, రసాయన ఎరువులు లేకుండా కూరగాయలు, పండ్లు పండించాలనుకున్నాను. పెద్ద పెద్ద టబ్‌లు తెచ్చి.. ఆకు కూరలు, కూరగాయలు, నిమ్మ, బత్తాయి, నారింజ, మామిడి, సపోటా, నేరేడు, అరటి, యాపిల్‌బేర్, అంజీర్, పైన్ యాపిల్, జామ, వాటర్ యాపిల్, మల్బరీ పండ్ల మొక్కలు పెంచాను. టెర్రస్ మీద పండ్ల చెట్లు పెంచుకోవడం సాధ్యమేనని చాలామంది నా వల్ల తెలుసుకున్నారు. మా ఇంటికి కావాల్సిన పండ్లన్నీ టెర్రస్ మీదే పండిస్తున్నాను. ఆ తర్వాత ఔషధ మొక్కలు, పూల మొక్కలు, అలంకరణ మొక్కలు కూడా ఇంటి ఆవరణలోనే పెంచాను.

మిద్దెతోట అంటే మొక్కలు నాటడంతో సరిపోదు. అంతవరకు చాలా సులువే! వాటిని పెంచడం మాత్రం చెప్పినంత తేలిక కాదు. ఇది అనుభవమైతే గానీ అర్థం కాదు. వాటర్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, టెర్రస్ ప్లాంట్స్‌లో దేనిని ఎలా పెంచుకోవాలో అనుభవంతోనే నాకు అవగాహన వచ్చింది. ఒకదానికి రోజూ నీరు పోస్తూ ఉండాలి. ఇంకోదానికి రోజూ పోస్తే సమస్య! మొక్కకు ఎండ సోకడంలోనూ ఇలాగే అవగాహన ఉండాలి. మొక్కలు ఎప్పుడు నాటుకోవాలి. ఎప్పుడు కొమ్మలు కత్తిరించాలి? ఎలాంటి ఎరువులు వేయాలి? ఫలసాయం ఎక్కువ రావడానికి ఏం చేయాలి? ఇవన్నీ తెలుసుకోవడం కోసం యూట్యూబ్ చూశాను.
మిద్దెతోట పెంపకం గురించి తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు చెప్పే విషయాలు కూడా పాటించాను. ఆయన ప్రేరణతో అనేక రకాల మొక్కలు పెంచాను. ఆర్గానిక్ కూరగాయలు, పండ్ల ధరలు ఎక్కువ. వాటిని మధ్యతరగతి కొనలేదు. కాబట్టి పెరటిలో, మిద్దెపై సాగు చేసుకోవాల్సిందే! పట్టణాల్లో సాగు సలహాలు ఇచ్చేవాళ్లు తక్కువ. కాబట్టి అన్నీ సొంతంగా నేర్చుకోవాల్సిందే. ఆలుగడ్డ, క్యారెట్, బీట్రూట్ కూరలు సాగు చేయాలంటే నేల వదులుగా ఉండాలి. మిగతావాటికి వేరుగా ఉండాలి. ఏ మొక్కకు ఎంత ఎరువు ఇవ్వాలి? ఏ మొక్కకు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పోయాలి? నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకునేప్పుడు తెగుళ్లు లేనివి ఎంచుకోవడం ఎలా? ఇవన్నీ యూట్యూబ్ చూసి తెలుసుకున్నాను.
యూట్యూబ్ నాలెడ్జ్‌తోనే మిశ్రమాలు కొని మొక్కలు పెంచాను. కానీ, అనుకున్నంత దిగుబడి రాలేదు. కుండీల్లోని మట్టిలో సారం లేనప్పుడు ఫలాలు ఎట్లొస్తాయి? అప్పుడు మార్కెట్ మీద ఆధారపడకుండా మిశ్రమాలు సొంతంగా తయారు చేయడం మొదలుపెట్టాను. మట్టి, పశువుల పెంట, మేకల పెంట, కొబ్బరి పిట్, వేప పిండి, ఇసుకను వివిధ పాళ్లలో కలిపి కుండీలు నింపాను. ఇలా సాగు చేయడం వల్ల నేల మీద పెంచితే ఎంత దిగుబడి వచ్చిందో కుండీల్లోనూ అంతే ఫలసాయం వచ్చింది.
నేను ఇతరుల నుంచి తెలుసుకున్నవి, నేను స్వయంగా నేర్చుకున్న వాటిని వాట్సాప్ ద్వారా మిద్దెతోట మిత్రులకు చెప్పేదాన్ని. ఇలా చెబుతున్న సందర్భంలోనే తుమ్మేటి రఘోత్తమరెడ్డి పరిచయం అయ్యారు. ఆయన స్ఫూర్తితో మిద్దె తోట విషయాలు రాయడం, ఈ రంగంపై ఆసక్తి ఉన్న మిత్రులను కలవడం, సమావేశాలు నిర్వహించడం చేస్తున్నాను. మిద్దెతోట పెంపకంపై అవగాహన కల్పించడం, సందేహాలకు సలహాలివ్వడం పనిగా పెట్టుకున్నాను.
ఎలిస్ వరల్డ్ పేరుతో వాట్సాప్ గ్రూప్‌లు నడుపుతున్నాను. మిద్దెతోట పెంచేవాళ్లకు వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంటాను. మంగళవారం, శనివారం ‘మీ ప్రశ్నలు మా సమాధానాలు’ కార్యక్రమం ఉంటుంది. గ్రూపులో ఎవరైనా సందేహాలు అడిగితే సలహాలిస్తాను. ప్రతి బుధవారం ‘మిద్దె మీద పంట.. ఇంట్లో వంట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. సభ్యులు మిద్దె పంటతో ఏం వండారో వాట్సాప్ గ్రూప్‌లో అందరితో పంచుకుంటారు. ఫేస్బుక్లో మిద్దెతోట, సేంద్రియ సేద్యం అనుభవాలు రాస్తున్నాను.
ప్రతి శుక్రవారం ఒక విషయం పోస్ట్ చేస్తుంటాను. 51 వారాలు విజయవంతంగా రాశాను. ‘మేడమ్ ఇంత బాగా సలహాలు ఇస్తారు. ఇవన్నీ ఒక బుక్‌లాగా వేస్తే బాగుంటుంది కదా’ అని చాలామంది అడిగారు. ‘లతాస్ గార్డెన్’ పేరుతో లతా కృష్ణమూర్తి పుస్తకం రాశారు. ఆమె ప్రేరణతో నా అనుభవాలను అక్షరీకరిస్తున్నాను. వాటిని రైతునేస్తం ఫౌండేషన్ ప్రచురిస్తున్నది.
మా ఇంట్లో నెలకోసారి ‘మిద్దెతోట మీట్’ ఏర్పాటు చేస్తున్నాను. ‘మేడమ్ ఈ నెల మా ఇంట్లో పెడదాం’ అని ఎవరైనా ముందుకు వస్తే.. వాళ్లింటో నిర్వహిస్తాం. ఇలా ఒకరి మిద్దె తోటను మరొకరు చూసి నేర్చుకునేందుకు అవకాశం కలుగుతుంది. మిద్దెతోట మీట్లో సీజన్ మారినప్పుడు ఏ కూరగాయలు పండించాలి? ఎలా పండించాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అనే విషయాలు ప్రధానంగా చర్చిస్తాం. మొదట్లో మిద్దె తోట మీట్లు హైదరాబాద్‌లో నడిచేవి. ఇప్పుడు ఇతర పట్టణాల నుంచీ పిలుస్తున్నారు. మా ఆయన నాగరాజు కోట నన్ను ఆ ఊళ్లకు తీసుకుపోతారు. అక్కడ మిద్దెతోట అవగాహన కల్పిస్తాను. కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసేవారికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన శాఖ నన్ను ఆహ్వానిస్తుంటుంది. గెస్ట్ స్పీకర్‌గా వారికి నా అనుభవాలు చెబుతుంటాను. రైతు నేస్తం ఫౌండేషన్ కార్యక్రమాల్లోనూ ప్రసంగిస్తున్నాను.
మొక్కలు ఖరీదైనవి. కొన్ని మొక్కలు కొన్ని రోజులకే చనిపోయేవి. ఆర్థిక భారం తగ్గుతుందని నర్సరీని ఏర్పాటు చేసుకున్నాను. అప్పటికే పెరటి కోసం ఇంటికి దగ్గర్లో నాలుగు వందల గజాల స్థలం అద్దెకు తీసుకున్నాను. కూరగాయలు, ఆకుకూరల సాగుతోపాటు నర్సరీ పెంచుతున్నాను. దీనివల్ల ఆదాయం పెరిగింది. అయిదేళ్లలో సాగులో విశేషాలు ఎన్నో నేర్చుకున్నాను! ఇంట్లో గార్డెన్ పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లకు గార్డెన్ సెట్ చేస్తున్నాను. మెయింటెనెన్స్ శిక్షణ ఇస్తున్నాను. ఇలా చేయడం వల్ల నాకు, మరికొందరు కూలీలకు ఉపాధి ఉంటున్నది. మొదట నీటిని శుద్ధి చేసి, అయోనైజ్డ్ వాటర్‌గా మార్చే యూనిట్లు అమ్మేదాన్ని.
ఇప్పుడు పూర్తి సమయం మిద్దె తోటలకే కేటాయిస్తున్నాను. దీన్ని నా ప్రొఫెషన్‌గా మార్చుకున్నాను. ఇప్పుడు మా ఇంట్లోవాళ్లు మంచి ఆహారం తీసుకుంటున్నారు. చేతినిండా పని ఉంది. కాబట్టి జిమ్‌లో వ్యాయామం అవసరమే లేదు. పనిలో సంతోషం ఉంది. ఆరోగ్యంగా ఉన్నాను. అందరికీ ఈ అనుభవాలు చెప్పడమే ఓ పనిగా పెట్టుకున్నాను! నా కృషికి గుర్తింపుగా రైతు నేస్తం-రఘోత్తమరెడ్డి మిద్దెతోట పురస్కారం ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన శాఖ రెండు సార్లు గోల్డ్ గార్డెన్ అవార్డ్ ఇచ్చింది. గాంధీ గ్లోబల్ ట్రస్ట్ ‘పుడమి పుత్ర’ అవార్డ్ ఇచ్చింది. ఇలా నా మిద్దెతోట మూడు పూలు ఆరు కాయలుగా సంతోషాన్ని, తృప్తిని ఇస్తున్నది!
యూట్యూబ్ చానెల్స్ చూసి నేను ఆర్గానిక్ గార్డెనింగ్ నేర్చుకున్నాను. నా అనుభవాలు అందరితో పంచుకోవాలని ‘Eli’s World (తెలుగు గార్డెనింగ్ చానెల్)’ పేరుతో యూట్యూబ్ చానెల్ పెట్టాను. మొదట్లో కొంతమంది హేళన చేశారు. ‘నా కూతురు కూడా నీ ఫేస్‌కి ఇది అవసరమా?’ అని గేళి చేసింది. ఇప్పటి వరకు యూట్యూబ్‌లో దాదాపు వెయ్యి వీడియోలు చేశాను. వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మా అమ్మాయి ‘మా మమ్మీ తోపు’ అని అంటున్నది.
– ఎలిజబెత్ కోట
– నాగవర్ధన్ రాయల