Fee Reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, వామపక్ష విద్యార్థి సంఘాల చలో సచివాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. సెక్రటేరియట్ సమీపంలోకి వెళ్లిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థి నాయకుల మధ్య తీవ్రతోపులాట చోటు చేసుకుంది. విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఆ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్, అశోక్ రెడ్డి, ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోనగిరి మధుకర్, ఏఐఎస్బీ రాష్ట్ర నాయకుడు సన్నీ గౌడ్, ఏఐపీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆడేపు ప్రవీణ్ కుమార్తో సహా అన్ని విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.