కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 21: జవాన్లు ఎన్నికల విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడి పది మందికి గాయాలైన ఘటన ఆదివారం జగదల్పూర్లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. ఛత్తీస్‌గఢ్‌లో లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. దీంతో జగదల్పూర్ నుంచి భద్రతాదళాలు ప్రత్యేక బస్సులో హెడ్‌క్వార్టర్స్‌కు తిరిగి వస్తుండగా, కోడ్నార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దిల్మిలి వద్ద బస్సుకు ఎద్దు అడ్డు వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదిమందికి గాయాలవగా, అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఆ సమయంలో బస్సులో 30 మంది సైనికులు ఉన్నారు. క్షతగాత్రులను జగదల్పూర్లోని డిమ్రపాల్ మెడికల్ కాలేజీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు బస్తర్ ఎస్పీ శలభ్ కుమార్సిన్హా ధ్రువీకరించారు.