హనుమకొండ చౌరస్తా/కమాన్పూర్, ఆగస్టు 8 : తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం విజయవంతంగా ముగిశాయి. రెండు రోజులు జరిగిన ఈ పోటీల్లో 33 జిల్లాల నుంచి 1811 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అండర్-18 (యూత్) బాలబాలికలు పంజాబ్లోని లూధియానాలో జరిగే నేషనల్ యూత్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో ప్రతిభ చూపింది. అండర్-18 విభాగం 400 మీటర్ల పరుగు పందెంలో 56 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని స్వర్ణ పతకం సాధించడంతో పాటు 21వ జాతీయ యువ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపికైంది. పంజాబ్లో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నది. ఆనంది కమాన్పూర్ (గుండారం) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. కాగా, ఆమె గతంలోనూ జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించగా, మరోసారి సత్తా చాటి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నది.