హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ హుసేన్సాగర్ వేదికగా జరుగుతున్న జాతీయ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు అదరగొడుతున్నారు. అండర్-16 అప్టిమిస్టిక్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రవికుమార్ అద్భుత ప్రదర్శనతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన రేసులో ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన రవికుమార్ చిరస్మరణీయ విజయం సాధించాడు. ఇదే రేసులో రాష్ర్టానికి చెందిన నరసింహ ఓవరాల్గా రెండో స్థానంలో నిలిచాడు.
శనివారం చివరి రెండు రేసులు మిగిలి ఉన్నందున ప్రతిష్టాత్మక టైటిల్ కోసం రవికుమార్, నరసింహ మధ్య పోటీ నెలకొన్నది. అండర్-15 బాలికల విభాగంలో యువ సెయిలర్ రమీజా భాను ఓవరాల్గా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇతర విభాగాల్లో ప్రీత్ సివాల్, కౌశిక్(లేజర్), ఇంటర్నేషనల్ 420 విభాగంలో బద్రీనాథ్, రిశ్విక జోడీ ఒక్క పాయింట్ ఆధిక్యంతో చంద్రలేఖ, ధనుశ్ ద్వయంపై ఆధిక్యం కనబర్చగా, 29ఈఆర్ స్కిఫ్స్ విభాగంలో వినోద్, ఆరవింద్ జోడీకి తోడు శరణ్య జాదవ్, శివం వాల్మికి ద్వయం సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.