హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఒకవైపు వేదిక ఏదైనా తెలంగాణ రాష్ర్టానికి అప్పు పుట్టడం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్తుండగా, మరోవైపు ఆయన ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఐదు నెలల్లో ఏకంగా రూ.39,900 కోట్లు అప్పు చేసింది. తాజాగా మంగళవారం ఆర్బీఐ నుంచి రూ.6,000 కోట్లు అప్పు చేసింది.
ఇందులో 26 ఏండ్ల కాల పరిమితితో రూ.1,500 కోట్లు, 32 ఏండ్ల కాల పరిమితితో రూ.1,500 కోట్లు, 38 ఏండ్ల కాల పరిమితితో మరో రూ.1,500 కోట్ల అప్పు తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల ద్వారా మొత్తం రూ.54,009 కోట్లు సమీకరిస్తామని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన కాంగ్రెస్ సర్కారు తొలి ఐదు నెలల్లోనే రూ.39,900 కోట్లు అప్పు చేయడం గమనార్హం. ఇది బడ్జెట్లో ప్రతిపాదించిన వార్షిక రుణ మొత్తంలో దాదాపు 74 శాతానికి సమానం.