హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ కుంభకోణంపై బుధవారం లోకాయుక్త విచారణ జరపనున్నది. ఈ మేరకు ఐదుగురు అధికారులకు లోకాయుక్త నోటీసులు అందజేసింది. అన్ని రకాల రిపోర్టులతో బుధవారం విచారణ కు హాజరుకావాలని ఆ నోటీసుల్లో ఆదేశాలిచ్చింది. డీఎస్సీ-2014 ఎస్జీటీ పోస్టుల భర్తీలో భారీ స్కాం జరిగింది.
ఒక్కో పోస్టును రూ.15 లక్షలకు అమ్ముకున్నట్టు ఆరోపణలొచ్చాయి. అధికారులు జీవో-74కి వ్యతిరేకంగా నియామకాలు చేపట్టి నకిలీ సర్టిఫికెట్లున్న వారికి ఉద్యోగాలిచ్చారు. జాతీయ స్థాయి క్రీడాకారులను పక్కనపెట్టి జిల్లా రాష్ట్రస్థాయి క్రీడాకారులకు ఉద్యోగాలిచ్చారు. అసలు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించకుండానే అస్మదీయులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. అలా 25 మంది అనర్హులకు ఉద్యోగాలిచ్చినట్టు సమాచారం.
ఈ బాగోతంపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. కంగుతిన్న అధికారులు.. 2024 నవంబర్లో 393 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. ఆ తర్వాత హైలెవల్ కమిటీ అంటూ మరోసారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టారు. అర్హుల జాబితా తేల్చక స్పోర్ట్స్ అథారిటీ, విద్యాశాఖ అధికారులు పరస్పరం నెపాన్ని వేసుకుంటున్నారు.