Fee reimbursement | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ నెల 13 నుంచి కాలేజీల నిరవధిక బంద్ పాటిస్తామని హెచ్చరించాయి. ఈ నెల 12లోగా రూ.1000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, లేదంటే కాలేజీల బంద్ తప్పదని పునరుద్ఘాటించాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) కార్యవర్గం బుధవారం హైదరాబాద్‌లో అత్యవసరంగా భేటీ అయ్యింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలలో సర్కారు నిర్లక్ష్యంపై చర్చించారు. అనంతరం మీడియాతో ఫతి ప్రతినిధులు మాట్లాడుతూ ఇక నుంచి తాము మంత్రులతో చర్చించబోమని, సీఎం లేదా సీఎంవో నుంచి చర్చలకు ఆహ్వానిస్తేనే వెళ్తామని ప్రకటించారు. ఈనెల 13 -18 లోపు ముఖ్యమంత్రి తమతో చర్చించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2,500 కాలేజీల యాజమాన్యాలు ఈ సమావేశానికి హాజరవుతాయని ప్రకటించారు.
ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలపై శీతకన్ను ప్రదర్శిస్తున్నదని ఫతి ప్రతినిధులు ఆరోపించారు. ప్రభుత్వం చేసిన పాపానికి కాలేజీల్లో పనిచేసే అటెండర్లు దసరా చేసుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. సెప్టెంబర్‌లో తాము బంద్ పాటించినప్పుడు రూ.600 కోట్లు ఇస్తామని డిప్యూటీ సీఎం, మంత్రులు హామీనిచ్చారని, దీపావళి వరకు మరో రూ.600 కోట్లు ఇస్తామన్నారని వారు గుర్తుచేశారు. తమ ఆందోళనలో భాగంగా ఈ నెల 12 నుంచి 18 వరకు జిల్లాల్లో రోజుకో కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ఈ ఆందోళనలు కళాశాలల బంద్, హైదరాబాద్ ముట్టడి, రైల్‌రోకో, నిరాహారదీక్షలు, రాస్తారోకో రూపంలో ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఫతి ప్రతినిధులు డిమాండ్‌చేశారు. ఫతి చైర్మన్ రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి కేఎస్ రవికుమార్, కొడాలి కృష్ణారావు, రాందాస్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై ఇన్నాళ్లు మీనమేషాలు లెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం బకాయిలు విడుదల చేసినట్టు తెలిసింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం కాలేజీలన్నీ ఈ నెల 6 నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించినట్టు నమస్తే తెలంగాణ ‘మళ్లీ కాలేజీల బంద్’ శీర్షికన ఓ కథనాన్ని ప్రచురించింది. హైదరాబాద్‌లో కాలేజీల యాజమాన్యాలు బుధవారం సమావేశం కానున్నాయని, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తారని ఆ కథనంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం బుధవారం రూ.200 కోట్ల వరకు విడుదల చేసినట్టు సమాచారం.