రాష్ట్రంలో రాజకీయాలు భూములు, ఆస్తుల చుట్టూ తిరుగుతున్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రజలు తమ భూములు, ఆస్తులు ఎంత వరకు చట్టబద్ధంగా సురక్షితంగా
ఉన్నాయోనని తెలియక ఆందోళన చెందుతుంటే, వారికి విశ్వాసాన్ని కల్పించాల్సిన అధికార పక్షం మరో తీరుగా వ్యవహరిస్తున్నది. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ముఖ్య నేతలు,
వారి బంధువులు భారీగా ఫామ్ హౌస్‌లు, ఆస్తులు కూడబెట్టుకున్నారంటూ అధికార పక్షం నానా యాగీ చేస్తున్నది. మరోవైపు మా కుటుంబ ఆస్తులు, మీ కుటుంబ ఆస్తుల
మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం కావాలి అని ప్రధాన ప్రతిపక్షం ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నది.
పాలకులు పనులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి ఇదొక ప్రజల పట్ల నిబద్ధత, వారి సంక్షేమానికి ఏదో ఒకటి చేయాలన్న తపన, రాష్ర్టాభివృద్ధి పట్ల దార్శనికత అత్యంత అవసరం. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గానీ, అధికార కాంగ్రెస్‌కు గానీ ఇటువంటి లక్షణం ఉన్నట్టు కనిపించడం లేదు. తమ పాలన పట్ల ప్రజల్లో సంతృప్తికర భావన సృష్టించుకోవడం కంటే, గత పాలకుల మీద నెగిటివ్ ఫీలింగ్ సృష్టించడం ద్వారానే రాజకీయ ఎత్తుగడలకు ప్రాధాన్యత ఇస్తున్నది. రాజకీయాల్లో ఒకరినొకరు దెబ్బతీసుకునే ఎత్తుగడలు అత్యంత సహజం! అధికార, ప్రతిపక్షాల మధ్య వ్యూహాలు-ప్రతివ్యూహాలు, నిఘాలు-నిర్బంధాలు, స్వపక్షంలోనే అసమ్మతులు, కుమ్ములాటలు లేకుండా రాజకీయాలు ఉండవనేది తెలిసిందే. అయితే, వీటిలో పడి ప్రజల తక్షణ సమస్యలను గాలికి వదిలిపెట్టకూడదనే విచక్షణను అధికార పక్షం కోల్పోకూడదు. దురదృష్టవశాత్తు ఇప్పుడు అధికారపక్షంలో ఆ విచక్షణే కొరవడుతున్నది. నిజానికి, ఇప్పుడు రాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనను, సుమారు మూడేండ్ల రేవంత్‌రెడ్డి పాలనను పోల్చుకునే దశ నడుస్తున్నది. గతంలో రాష్ట్రం ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉన్నది? అనే చర్చ ప్రజల మధ్య జరుగుతున్నది. హైదరాబాద్ నగరంలో ఏదైనా ఫంక్షన్లో నలుగురు కలిసిన చోట ముచ్చట్లు పెట్టుకుంటున్న సందర్భాల్లో తమను కుడుతున్న దోమల దగ్గర నుంచి ఈ చర్చ మొదలవుతున్నది.
కేసీఆర్ హయాంలో నిత్యం ఫాగింగ్ చేయించేవారని, కానీ ఇప్పుడు ఆ సీన్ లేదని, గతంలో మాదిరిగా రోడ్ల వెంట చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం లేదని, మురుగు కాలువల క్లీనింగ్‌ను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం సామాన్యుల ముచ్చట్లలో వ్యక్తమవుతున్నది.
కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం నీళ్లు, కరెంటు కోసం ఇబ్బందులు రాలేదని, వాటిని రేవంత్‌రెడ్డి సరిగా మ్యానేజ్ చేయలేకపోతున్నారనే టాక్ నడుస్తున్నది. గత, ప్రస్తుత పాలకులను పోల్చుకునే విషయంలో ప్రజలు ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఇలాంటి చర్చలు దోహదపడుతాయి. నలుగురు కలిసిన చోట జరుగుతున్న చర్చలు సహజంగానే కేసీఆర్‌కు సానుకూల అంశంగా మారుతున్నాయి. ఇది రేవంత్‌కు మింగుడుపడని, జీర్ణించుకోలేని పరిణామం.
అధికారంలోకి వచ్చిన కొత్తలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని రేవంత్‌రెడ్డి భీకర వ్యాఖ్యలు చేశారు. కానీ, కాంగ్రెస్ పాలనలో దుష్పరిణామాలను చూస్తున్న ప్రజలు, కేసీఆర్ చేసిన మంచి పనుల గురించి చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో కూడా గ్రామాల్లోని చెరువులు నీళ్లతో కళకళలాడటం, పంటలకు సమృద్ధిగా నీళ్లు పారడం, ఇంటింటికీ నల్లా నీళ్లు రావడం, ఠంచన్‌గా రైతుబంధు పైసలు పడటం వంటి అంశాలు ప్రజల కండ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు సమకూర్చడం, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, ఎప్పటికప్పుడు చెత్తను ఎత్తిపోయడం, వైకుంఠధామాల నిర్మాణం వంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రజల స్మృతిపథం నుంచి చెరిగిపోవడం లేదు. ఇలా కేసీఆర్ సమకూర్చి పెట్టిన వాటిని కాంగ్రెస్ సర్కార్ సరిగా మ్యానేజ్ చేయలేకపోతున్నదని ఎక్కడ నలుగురు కలిసినా వ్యక్తమవుతున్న అభిప్రాయం.
‘పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడైనా కేసీఆర్ చేసిన పనులు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. హైదరాబాద్‌ను స్టార్టప్‌ల హబ్‌గా మార్చారు. ఎక్కువమంది ఎంబీబీఎస్ చదువుకోగులుతున్నారు. ఇదంతా కూడా కేసీఆర్ ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల పుణ్యమే. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తున్నదో రాదోనన్న భయం ఉండేది కాదు. ‘మరి రేవంత్‌రెడ్డి చెప్పుకోవడానికి ఏమున్నది? మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ అంటున్నారు, అవి ఎంతవరకు వర్కవుట్ అవుతాయో.. ఏం ఫలితం ఇస్తాయో..?’ అని ఓ విద్యార్థి వ్యాఖ్యానించడం నవతరం ఓటర్ల మూడ్‌ను సూచిస్తున్నది. విచిత్రం ఏందంటే- ఇటీవల ముగిసిన గణేశ్ నిమజ్జనోత్సవాల సందర్భంగా కేసీఆర్ పాటలు పెట్టి యువత డ్యాన్స్‌లు చేశారు. ‘ది ప్యారడైజ్’ సినిమాలో కేసీఆర్‌ను పోలిన పాత్ర కనిపించగానే థియేటర్లలో యువత ఊగిపోయారు! ఇది కేసీఆర్ పట్ల యూత్‌లో క్రేజ్‌కు నిదర్శనం.
స్థూలంగా రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా అర్థమవుతూనే ఉన్నది. విద్యార్థులు- ఫీజు రీయింబర్స్మెంట్, క్యాంపస్ సెలక్షన్స్, ఉద్యోగ నోటిఫికేషన్లు. రైతులు- నీళ్లు, కరెంటు, సకాలంలో పెట్టుబడి సాయం, ఎరువులు, వ్యవసాయ భూములు. ఇండ్లు, ఇండ్ల స్థలాల యజమానులు- తమ ఆస్తులకు రక్షణ కోరుకుంటున్నారు.
ఏ క్షణంలోనైనా ఎటువంటి లిటిగేషన్లు, లీగల్ సమస్యలు లేకుండా అమ్ముకునేందుకు, ఏ ఆస్తినైనా ధైర్యం గా కొనుగోలు చేసుకోగలిగే అవకాశం ఉండాలని ఆశిస్తున్నారు. కానీ నేడు రాష్ట్ర ప్రజలు ఇవే విషయాల పట్ల తీవ్ర అభద్రతాభావాన్ని ఎందుర్కొంటున్నారు. ఇంతమందిని కలవరపెడుతున్న సమస్యలను సత్వరమే పరిష్కరించే మార్గాల మీద పాలకులు దృష్టి పెట్టకుండా, రాజకీయ ప్రత్యర్థులు, బంధుమిత్రుల ఆస్తుల మీద దృష్టి పెట్టడమే పాలన అనుకుంటే ప్రజలు హర్షిస్తారా? ఇదే పాలన అంటూ చెప్పుకుని తిరిగితే సహిస్తారా?
కందిబండ కృష్ణప్రసాద్
9182777010