ముందు కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టిండ్రు. పాలమూరు-రంగారెడ్డిని ఆపేసిండ్రు. మన కృష్ణా, గోదావరి నీళ్లను కిందికి వదిలేసేలా చేసిండ్రు. మళ్లీ ఏపీ అధికారులు వచ్చి, ఇక్కడ తిష్ట వేసిండ్రు. ఆంధ్రా బనకచర్లకు రేవంత్ సర్కార్ లోపాయికారి అంగీకారం తెలిపేలా కథ నడిపిండ్రు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని బీరాలు పలికినోళ్లు ఆంధ్రా నేతలకు సద్దులు కడుతున్నరు. ఇక్కడి సాంస్కృతిక వైభవాన్ని మసక బర్చేలా అస్తిత్వ చిహ్నాలను ఛిన్నాభిన్నం చేసిండ్రు. తెలంగాణ తల్లిని మార్చిండ్రు. అక్కడే అసలు కథ మొదలైంది. గమనించు తెలంగాణా!!
అదను చూసి, ఆంధ్రా నేతలు మళ్లీ రంగప్రవేశం చేసిండ్రు. మోకా దొరికితే చాలు తెలంగాణ మీద మాట్లాడుడు మొదలైంది. విషం కక్కడం నిమిషం కూడా ఆగలేదు. మహానాడు పెట్టి తెలంగాణ మీద ఏడుస్తరు. ‘అసలు తెలంగాణ పదమే డిక్షనరీలో లేదు’ అని బక్కని నర్సింహులు వంటి పిపీలికాలతో అనిపిస్తరు. ఎన్టీయార్, రోశయ్య, బాలసుబ్రమణ్యం ‘సమైక్య’ ప్రముఖుల విగ్రహాలు హైదరాబాద్ గడ్డపై మళ్లీ మొలిచినయ్. మరి ఈమధ్య కాలంలో ఒక్క తెలంగాణ ప్రముఖుడి విగ్రహమైనా కొత్తగా ఎందుకు ఏర్పాటుకు నోచుకోలేదు? ఆలోచించు తెలంగాణా!!
తెలంగాణ బుద్ధిజీవులపై, ఉద్యమకారులపై వేధింపులు మొదలైనయ్. ప్రొఫెసర్ నాగేశ్వర్, పాశం యాదగిరి వంటి వారిపై, జర్నలిస్టులపై ఆంధ్రాలో కేసులు నమోదైనయ్. ట్రోల్ ఆర్మీతో తెలంగాణ నేతలపై బూతులు తిట్టిస్తున్నరు. శుద్ధ సమైక్యవాది చంద్రబాబు మళ్లీ తెలుగుజాతి రాగం అందుకున్నడు. బద్ధ వ్యతిరేకి పవన్‌కల్యాణ్.. తెలంగాణను మళ్లీ నిర్మిస్తనంటున్నడు. అమరావతిని గాలికొదిలిన ఆంధ్రా నేతలు.. హైదరాబాద్‌ను ఉద్ధరిస్తరట! అర్థమవుతున్నదా.. తెలంగాణా?
రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఎవరైనా శుభాకాంక్షలు చెప్తరు. పుట్టినరోజునాడు చిరకాలం వర్ధిల్లుమని కాంక్షిస్తరు. కానీ జనసేనాని జగడానికి దిగినట్టే మాట్లాడిండు. ఇక్కడ తలదాచుకుంటూనే తలబిరుసు చూపించిండు! తెలంగాణ ఎవడి జాగీర్ అంటూ ప్రశ్నిస్తున్నడు! మేలుకో తెలంగాణా!
పుష్కరం తర్వాత.. పరాయి శక్తులు ఎందుకు మళ్లీ తెలంగాణ మీద పడ్డయ్? కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఎవరైనా ఈ సాహసం చేసిండ్రా? పదేండ్లు ఇటు తొంగిచూసిండ్రా? బీఆర్ఎస్ పక్కకు జరిగి రెండేండ్లు కాకుండానే మళ్లా కుట్రల నాగులు చుట్టుముడుతున్నవెందుకు? ఎవరిచ్చిన అలుసిది? పైలం తెలంగాణా!
వరంగల్, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణపై మళ్లీ కుట్ర కత్తులు విచ్చుకుంటున్నయా? తెలంగాణ వాదాన్ని అణచివేసేందుకు ‘నీది తెలుగే..నాది తెలుగే..తెలుగుజాతి మనది’ అని మాయచేసినట్టే.. నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎత్తుకున్న జాతీయవాదం ముసుగులో మరోసారి తెలంగాణ ఆత్మగౌరవానికి ఆపద ముంచుకొస్తున్నదా? అమీర్‌పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ‘ఇది విగ్రహం కాదు.. తెలుగుజాతికి స్ఫూర్తి. ఒక సీఎంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం నా జీవితకాలం గుర్తుండిపోయే మధుర సంఘటన’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల పరంపరను మంగళవారం పవన్ కల్యాణ్ కొనసాగించారా? సందర్భం దొరికిన ప్రతిసారీ ‘తెలుగుజాతి అంతా ఒక్కటే’ అని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఆంతర్యం తెలంగాణపై తమ ఆధిపత్యం చెలాయించేందుకేనా?
అక్కడి వారి కోసం ఇక్కడి పాలకులు ఎర్ర తివాచీ పరుస్తున్నారా?’ అంటే జరుగుతున్న పరిణామాలు ‘అవును’ అనే చెప్తున్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని, మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మళ్లీ ప్రమాదంలోకి నెట్టేందుకు తెరవెనుక గురుశిష్యులు పథకరచన చేసి తెరముందుకు పవన్‌కల్యాణ్‌ను ఉసిగొల్పుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి తద్వారా తమ భవిష్యత్తు కార్యాచరణకు పదునుపెట్టే ఎత్తుగడలో భాగంగానే ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు అని తెలంగాణ సమాజం ప్రబలంగా విశ్వసిస్తున్నది.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో టీడీపీ పోటీ చేయకుండా చేసిన రాజకీయ సత్తా కేసీఆర్‌ది అయితే, ఎనిమిదేండ్ల క్రితమే తెలంగాణలో పోటీ విరమించుకున్న తెలుగుదేశం పార్టీ, నాలుగైదు రోజుల క్రితం మంగళగిరి మహానాడు వేదికగా తాము మళ్లీ తెలంగాణలో బలపడుతాం అని ప్రకటించడం, తాజాగా పవన్ కల్యాణ్ సైతం తెలంగాణలో పోటీ చేస్తాం’ అని చెప్పడం వెనుక బలమైన కుట్రలు ఉన్నాయని తెలంగాణ సమాజం కలవరపడుతున్నది. ‘తెలంగాణలో జనసేన ఉంటుంది. మేమూ పోటీచేస్తాం. తెలంగాణలో నేనే తిరుగుతా’ అని పవన్ కల్యాణ్.. ఎవరు అడ్డొస్తారో చూస్తా అనే రీతిలో మాట్లాడటం వెనుక ఆయనకు వెన్నుదన్నుగా నిలబడింది ఎవరో? తెలియనంత అమాయకులు తెలంగాణ ప్రజలు కారు’ అని రాజకీయ విశ్లేషకులు తేల్చిచెప్తున్నారు.
‘పదేండ్లు కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ గురించి మేమేమైనా మాట్లాడామా?’ అని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్య ల నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే తెలంగాణపై ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలను పూసగుచ్చినట్టు పేరిస్తే తెలిసిపోతుందని, తెలంగాణపై మళ్లీ సమైక్యకుట్రలు తాళ్లు పేనుతున్నాయనే విషయం అర్థమైపోతుందనే వాదన బలంగా వినిపిస్తున్నదని అభిప్రాపడుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, తెలంగాణ అస్తిత్వాన్ని ఆపదలోకి నెట్టి ఇక్కడ మళ్లీ సమైక్యరాగం ఆలపించేందుకు జనసేన, టీడీపీ సిద్ధమయ్యాయని, అందుకు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైకిల్ గుంపు యథాశక్తి దోహదం చేస్తున్నదని తెలంగాణ మేధావివర్గం కుండబద్ధలు కొడుతున్నది.
‘తెలంగాణ మీ అయ్య జాగీరా’ అని పవన్ కల్యా ణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం నిప్పులు చెరుగుతున్నది. ‘అవ్…తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే’ అని నినదిస్తున్నది. ‘సినిమాల్లోలాగా తెలంగాణపై రౌడీయిజం చేస్తామనుకుంటే కుదరదు.. ఉద్యమంలో ఊరూరా ఉసిళ్ల దండై ఎగజిమ్మి తిష్టవేసిన ఎంతోమంది పీఠాలను కదిలించిన వీర తెలంగాణ ఇదని పవన్ గుర్తుంచుకోవాలి’ అని హెచ్చరిస్తున్నది. ‘పవన్ కల్యాణ్ సినిమా డైలాగులకు హాల్లో చిత్తుకాగితాలు చింపేపి గంతులేసిన తెలంగాణ కాదు ఇప్పుడున్నది..‘గావుపట్టే తెలంగాణ’ అని గుర్తుంచుకోవాలె’ అని నొసలు ఎగరేసి చెప్తున్నది. ప్రపంచ సీఈవోగా పోజులు కొట్టిన చంద్రబాబే తట్టాబుట్ట సర్దుకొని కరకట్టలు పట్టుకొని పారిపోయిన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని సూచిస్తున్నది.
జనసేన పుట్టింది ఇక్కడేనని పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ పుట్టింది ఇక్కడేనని చంద్రబాబు లోగడ చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆ పార్టీలకు తెలంగాణతో పేగుబంధం ఉన్నట్టు కాదనీ, ఇవి కనీస అవగాహన లేకుండా చేస్తున్న వ్యాఖ్యలు కాదని, ఆ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ మీద పెత్తనం చేయడానికి ఎంచుకున్న మార్గాలని తెలుసుకోనంత అమాయకులు ఇక్కడి ప్రజలు కాదని మేధావివర్గం హెచ్చరిస్తున్నది. పార్టీలు ఇక్కడ పుట్టినా వాటిని పుట్టించినవారి పుట్టుమచ్చలు ఎక్కడివి? ఇప్పుడు వారి ఆధార్‌లో ఉన్న అడ్రస్ ఏమిటో చూసుకోవాలి కదా! అని ఎద్దేవా చేస్తున్నది.
‘నేను ఇప్పటి దాకా నిర్ణయించుకోలే. ఇప్పుడు చెప్తున్నా..తెలంగాణలో జనసేన ఉంటుంది. తెలంగాణలో నేనే తిరుగుతా.. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం’ అని పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కల్లోలం రేపేందుకేనని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. అయితే, ఈ వ్యాఖ్యలు స్వతహాగా పవన్ చేసినవి కావని, సహజంగానే నటుడైన పవన్ కల్యాణ్‌కు పకడ్బందీ స్క్రిప్ట్, దానికి తగిన డైరెక్షన్ తెరవెనుక ఉన్నదని, అలా తెరముందు, తెరవెనుక ఉన్నవాళ్లు మానుకోట రాళ్లకు ఉండే పౌరుషం ఇప్పుడు ఊరూరా ఉన్నదనే విషయం గుర్తుంచుకోవాలని తెలంగాణ హెచ్చరిస్తున్నది.
మరోవైపు ‘పొట్ట కూటికోసం వచ్చినవాళ్లతో మాకేపేచీలేదు.. మా పొట్టకొట్టేవారిపైనే మా పోరా టం’ అని తెలంగాణ ఉద్యమనాయకత్వం స్పష్టంగా పేర్కొన్నది. అన్నట్టుగానే ఉద్యమ సమయంలోనే కాదు రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ పౌరుడు, ఏ ఒక్క రాష్ర్టేతరుడి హక్కులను కాలరాయలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇంత సఖ్యతగా బతుకుతున్న రాష్ట్రంలో కల్లోలాన్ని సృష్టించేందుకు ఎవరు సాహించినా చూస్తూ ఊరుకునేది లేదని తెలంగాణ సమాజం హెచ్చరిస్తున్నది.
మంగళగిరి మహానాడు.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు అన్నీ వాటికవే జరుగుతున్న పరిణామాలు కావని, తెలంగాణ అస్తిత్వానికి ఆపద తెచ్చే కుట్ర రాజకీయ పరిణామాలని గ్రహించాలని మేధావివర్గం ఉదహరిస్తున్నది. తెలంగాణ అసలు కాంగ్రెస్ నాయకులు కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు స్క్రిప్ట్‌కు ఇక్కడి కాంగ్రెస్ సైకిల్ ‘గుంపు’ స్క్రీన్‌ప్లే చేస్తుంటే చంద్రబాబు డైరెక్షన్ చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2014లో రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలుపగానే ‘మీ మట్టుకు మీరు రాష్ర్టాన్ని విభజిస్తారా? రాష్ర్టాన్ని విభజించే పద్ధతి ఇదా? ఏం అడిగేవాళ్లు లేరని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా?’
అని చంద్రబాబు ఒంటికాలిపై లేచిన విషయాన్ని గుర్తుచేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12 ఏండ్ల తర్వాత అదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాడు ‘తెలంగాణ రాష్ట్ర విభజన సరైన పద్ధతుల్లో జరిగిందా? మీరు అంగీకరిస్తారా? ప్రేమ పేరుతో విడిపోవచ్చు. గొడవలు పడి విడిపోతారా?’ అని పవన్ కల్యాణ్ ఉదహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ‘ఆనాడు హైటెక్ సిటీని చంద్రబాబు అభివృద్ధి చేశారు. అదే రీతిలో మేము ఫోర్త్‌సిటీని అభివృద్ధి చేస్తున్నం’ అని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ఈ పరిణామాలను క్రోఢీకరిస్తే అసలు విషయం బోధపడుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఏపీకి డిప్యూటీ సీఎం అయి ఉండి పవన్ కల్యాణ్ తెలంగాణకు వచ్చి హడావుడి చేయడం, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, హైదరాబాద్‌లో అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఈ స్థాయిలో గందరగోళం సృష్టించడం వెనుక ప్రజల దృష్టి మళ్లించే కుట్రలు దాగి ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ర్టాల్లోని అధికార పార్టీలు తమ పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించటానికే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి డ్రామా ఆడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తెలంగాణలో ఆరు గ్యారెంటీల ఆశ చూపి కాంగ్రెస్ ప్రభుత్వం, సూపర్ సిక్స్ పథకాల హామీతో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ, ఇక్కడ ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలేక కాంగ్రెస్, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాయి.
వడ్లు కొనుగోళ్లు లేక, ఎరువులు ఇవ్వక, రైతు భరోసా వేయక ఇబ్బందులు పెడుతున్న రేవంత్ ప్రభుత్వంపై పల్లెల్లో రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నది. హైదరాబాద్‌లో హైడ్రా పేదల ఇం డ్ల మీద పడుతుండటం, ప్రభుత్వ పెద్దలు అడ్డూఅదుపు లేకుండా భూ కుంభకోణాలకు పాల్పడుతుండటంతో పట్టణ ప్రజలు కోపంతో ఉన్నారు. బెనిఫిట్స్ అందక రిటైర్డ్ ఉద్యోగులు, ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు, నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఇలా అన్ని వర్గాల ప్రజలు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉన్నది. ‘సూపర్ సిక్స్’ అమలు చేయలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. అప్పు ల మీద అప్పులు చేస్తూ, అమరావతి జపం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు 30 వేల మంది మహిళల ఆచూకీ లేదని, అక్రమ రవాణాతోనే వారు అదృశ్యం అయ్యారని పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మహిళల జాడ ఏదని ఏపీ మహిళలు పవన్ కల్యాణ్‌ను అడుగుతున్నారు. ఏపీలో డీఎస్సీ 2025 కుంభకో ణం అంటూ ప్రచారం జరుగుతున్నది. ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ముగ్గురూ డ్రామాలాడుతున్నారని విశ్లేషకులు చెప్తున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనేది రాష్ట్ర ప్రజలందరికీ ఒక స్ఫూర్తివంతమైన రోజు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష, దాని కోసం జరిగిన ఉద్యమాలు, చేసిన త్యాగాలు, ఉద్యమానికి సార థ్యం ఎవరు వహించారు? ఎవరెవరు సహకరించారు? తెలంగాణ ఉద్యమానికి ఎవరెవరు ద్రోహం చేశారు? వంటివన్నీ ఒకసారి మననం చేసుకుంటారు. ఇదే జరిగితే తెలంగాణ ప్రజలు మరోసారి చైతన్యవంతులు అవుతారని గుర్తించిన సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్‌ను తెలంగాణలోకి దింపారనే చర్చ జరుగుతున్నది. అందుకే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే పవన్ సభ పెడుతానని చెప్పడం, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, మంత్రులు అడ్డగోలుగా పవన్‌ను విమర్శించడం, పవన్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ అహంకార పూరితమైన, అడ్డగోలు వ్యాఖ్యలు చేయ డం చకచకా జరిగిపోయాయని చెప్తున్నారు.
‘1200 మంది ఉద్యమకారులు చనిపోతే వారిమీద ఒక్కమాట మాట్లాడలే’ అని పవన్ కల్యాణ్ పేర్కొనడంపై తెలంగాణ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. ‘తెలంగాణకు నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు..తెలంగాణను అభివృద్ధి చేసింది నేనే’ అని పదేపదే పేర్కొన్న చంద్రబాబు రెండుకండ్ల వైఖరి వల్లే వందలాది మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. టీడీపీ లేఖ ఆలస్యం వల్లే తాము నిర్ణయం తీసుకోలేకపోతున్నామని కాంగ్రెస్.. కాంగ్రెస్ ఇస్తే తాము అడ్డుకుంటామా! అని చంద్రబాబు అడ్డంపొడుగూ మాట్లాడటం వల్లే వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారు. తెలంగాణ ఆవిర్భావం రోజునే పవన్ కల్యాణ్ అమరవీరులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో వరంగల్ పర్యటనలో తెలంగాణ నాయకులపై నోరుపారేసుకున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏకంగా అమరవీరుల త్యాగాలనే వక్రీకరించేస్థాయికి ఎదిగారని తెలంగాణ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన వైఖరి మార్చుకోలేదని చెప్పకనే చెప్పారు. ‘2014లో రాష్ట్ర విభజన తర్వాత తాను 11 రోజులు తినలేదంటే తెలంగాణ ఇచ్చినందుకు కాదు.. విభజించిన తీరుపై. మీరు దీన్ని ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు’ అని తేల్చిచెప్పారు. ‘చిల్లిగారెకు తూటు’ అన్న చందంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనే తప్పుపట్టేవాడికి తెలంగాణ రాజకీయాలతో ఏం పని? అని ప్రశ్నిస్తున్నారు.