HomeNewsTelangana Movement Kcr Historic Day Of Sacrifice
ఆ దీక్ష.. శ్రీరామరక్ష
అది తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటాన్ని కీలక ఘట్టానికి చేర్చిన దీక్ష. చిరకాల ఆకాంక్షలను తట్టిలేపి విజయతీరాలకు నడిపించిన దీక్ష. ఒక స్వప్నాన్ని సాకారం చేసిన దీక్ష. తన జాతిజనుల కోసం ఓ బక్క పల్చని మనిషి దిక్కులు పిక్కటిల్లేలా ఆత్మార్పణకు సిద్ధమైన దీక్ష.
అది తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటాన్ని కీలక ఘట్టానికి చేర్చిన దీక్ష. చిరకాల ఆకాంక్షలను తట్టిలేపి విజయతీరాలకు నడిపించిన దీక్ష. ఒక స్వప్నాన్ని సాకారం చేసిన దీక్ష. తన జాతిజనుల కోసం ఓ బక్క పల్చని మనిషి దిక్కులు పిక్కటిల్లేలా ఆత్మార్పణకు సిద్ధమైన దీక్ష. కేసీఆర్ అనే మూడక్షరాలను తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన దీక్ష. గుండెచప్పుళ్లను గుదిగుచ్చిన దీక్ష. సకల పోరాటాల పతాక సన్నివేశమైన దీక్ష. తెలంగాణకు అదే ఆది, అదే మూలం. తరాలు గడిచినా తీరని ఆకాంక్ష సాకారమైన విజయ్ దివస్ ఇది. త్యాగాల కేతనం. 2009లో ఆరోజే అసలైన తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత 2014 వరకు కుట్రలతో, కుహకాలతో కాలహరణం ఎంత జరిగితేనేం? కేసీఆర్ దీక్ష తెలంగాణ ఆకాంక్షకు శ్రీరామరక్షగా నిలిచింది. తెలంగాణ త్యాగాలకు కేసీఆర్ దీక్ష ఓ మేలిమలుపు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఓ తెగింపు. ఎనిమిదేండ్లుగా జాతీయ రాజకీయ ఏకాభిప్రాయం సాధించిన చాతుర్యానికి కేసీఆర్ ఆమరణ దీక్ష ఓ మూలమలుపు, గెలుపు పిలుపు.
తెలంగాణ కోసం ఎందరో పోరాడారు. గమ్యం అందినట్టే అంది చేజారిపోయిన సందర్భాలెన్నో. బూర్గుల రామకృష్ణారావును గెలిపించింది తెలంగాణ నిలుస్తుందని. కానీ, తెలంగాణ చేజారింది. చెన్నారెడ్డినీ తెలంగాణ గెలిపించింది. అయినా తెలంగాణ రాలేదు. ఇలా ఆకాంక్ష ఎగసిపడిన ప్రతిసారీ చల్లారింది. తెలంగాణ బతుకు తెల్లారింది. తెలంగాణ ఇక రాదని గుండెలు కుంగిపోతున్న వేళ ఆకాంక్షను రగిలించిన కేసీఆర్ అడ్డంకుల్ని ఒక్కొక్కటిగా ఛేదించారు. అనుకున్నది సాధించారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఎక్కని కొండ లేదు, మొక్కని బండ లేదు. అవసరమైతే గొంగళి పురుగునైనా ముద్డాడుతానని ప్రతిజ్ఞ చేసి, మాట తప్పితే రాళ్లతో కొట్టండని భరోసా ఇచ్చి అందరినీ కూడగట్టారు. తెలంగాణను విజయపథంలో నిలబెట్టారు.
సంకల్పశుద్ధి లక్ష్యసిద్ధికి దారితీసింది. తెలంగాణ ఇవ్వక తప్పని అనివార్యతను కలిగించిన ఆ దీక్షతో తెలంగాణ సాకారమైంది. అందుకే తెలంగాణ, కేసీఆర్ అనేవి పరస్పరం పర్యాయ పదాలయ్యాయి. ఆపై నూతన రాష్ట్ర సారథిగా అభివృద్ధి పథంలో నడిపించిన పరిపాలన సామర్థ్యం కేసీఆర్ సవ్యసాచిత్వానికి నిదర్శనమై వెలిగింది. ఉమ్మడిపాలన దోపిడీలో వెనుకవేయబడిన ప్రాంతం మునుముందుకు సాగి ఆకాశపు అంచులు చూసింది. దేశానికే తెలంగాణ ఆదర్శమై రెపరెపలాడింది.
ఓటుకు నోటు మాయగాళ్ల వలలో, అలవిగాని గ్యారెంటీ ప్రలోభాల సుడిలో చిక్కి తెలంగాణ ఇప్పుడు మళ్లీ కష్టాల పాలయ్యింది. తెలంగాణ సోయిలేని మనోడే దొంగలకు సద్ది గడుతున్నడు. తెలంగాణ తల్లి కిరీటాన్ని పడదోసి సంబురపడుతున్నడు. ఇదే అదనుగా వలసవాదులు మళ్లీ తెలంగాణపైకి తెగబడుతున్నరు. రకరకాల ముసుగులు వేసుకుని ఎగబడుతున్నరు. తెలంగాణ అస్తిత్వానికే పొగబెడుతున్నరు. విగ్రహాల పేరిట తెలంగాణ నిగ్రహాన్ని పరీక్షకు పెడుతున్నరు. మనతనాన్ని మనం కాపాడుకోవాల్సిన చారిత్రక అనివార్యత ఇప్పుడు మన ముందుకువచ్చింది. ‘దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం.. ప్రాంతంవాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతరవేస్తం’ అన్న కాళోజీ స్ఫూర్తితో పోరాడాల్సిన తరుణమిది. కేసీఆర్ దీక్ష స్ఫూర్తిగా విజయ్దివస్ సంకల్పం తీసుకొని ముందుకు కదలాల్సిన సమయమిది.