హైదరాబాద్ ఆట ప్రతినిధి, నవంబర్ 19: దేశంలోనే నంబర్ వన్ క్రీడా వేదికగా తెలంగాణ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బ్రోచర్‌ను మంత్రి తన నివాసంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిలిప్పీన్స్ స్పోర్ట్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ విలియం రామిరేజ్, పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్, హైదరాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం రాజేశ్ కుమార్ మాట్లాడుతూ.. అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ, హైదరాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 12 నుంచి 13వ తేదీ వరకు గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలో హైదరాబాద్ ఓపెన్ స్ప్రింట్స్ అండ్ రిలే అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ నిర్వహించనున్నారని, వివరాలకు అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ ప్రతినిధిని 9885911520 సంప్రదించాలని సూచించారు.
జాతీయ సీనియర్ ఫుట్‌బాల్ చాంప్ తెలంగాణ పురుషుల జట్టు
ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు బెంగళూరులో జరగనున్న సంతోష్ ట్రోఫీ సీనియర్ ఫుట్‌బాల్ చాంపియన్ షిప్లో పాల్గొనే తెలంగాణ పురుషుల జట్టును శుక్రవారం తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శి జి.పాల్గుణ ప్రకటించారు. జట్టులో ఇషాన్ సర్కార్, ఎస్.హుస్సేన్, రాజా దేబ్నాథ్, షేక్ ఉమర్, తాతమ్ నాయుడు, సయ్యద్ అలీ ఖాయం, ఆకాశ్ కాల్విన్, షఫీక్ మహ్మద్, పవన్ కుమార్, రెహాన్ హుస్సేన్, వికాస్ యాదవ్, యూసఫ్ అలీ, కె.మదన్, సయ్యద్ యూసఫ్, ఆర్యన్ సింగ్, సయ్యద్ అబీద్ హుస్సేన్, మహ్మద్ ఖాసం, డి.జాషువా, ఇమాదుద్దీన్, వై.నిఖిల్, శ్రీధర్, సయ్యద్ కెహన్ ఎంపికతో పాటు జట్టు కోచ్, మేనేజర్‌ను కూడా నియమించినట్లు ఆయన వివరించారు.
క్రీడాకారులకు ట్రాక్ షూట్స్ పంపిణీ..
34వ జాతీయ టగ్- ఆఫ్ – వార్ చాంపియన్ షిప్లో పాల్గొనే తెలంగాణ సీనియర్ మహిళలు, పురుషుల జట్లకు నంది టైర్స్ అండ్ ట్యూబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా భరత్ కుమార్ రెడ్డి ట్రాక్ షూట్స్ పంపిణీ చేశారు. ఆలే నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ కార్యదర్శి ఇమానియాల్, ప్రతినిధులు పాల్గొన్నారు.