e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 23, 2022
Home News తెలంగాణ సక్సెస్‌ఫుల్‌ స్టార్టప్‌

తెలంగాణ సక్సెస్‌ఫుల్‌ స్టార్టప్‌

 • మన నినాదం స్టార్టప్స్‌ అయితే, కేంద్రం నినాదం ప్యాకప్‌.
 • మనం కొత్త పరిశ్రమలు ప్రారంభిస్తే, కేంద్రం ఉన్న పరిశ్రమల ఉసురు తీస్తున్నది.
 • ఎర్రబస్సు నుంచి ఎలక్ట్రిక్‌ బస్సు దాకా..
 • ఎలక్ట్రిక్‌ బస్సు నుంచి ఎయిర్‌ బస్సు దాకా..
 • ట్రాక్టర్‌ నుంచి హెలికాప్టర్‌ దాకా..
 • టైల్స్‌ నుంచి టెక్స్‌టైల్స్‌ దాకా..
 • యాప్స్‌ నుంచి గూగుల్‌ మ్యాప్స్‌ దాకా
 • అన్నిటికీ గమ్యస్థానం తెలంగాణ రాష్ట్రం.
 • గూగుల్‌కు గుండెకాయ హైదరాబాద్‌.
 • అమెజాన్‌, యాపిల్‌కు ఆయువు పట్టు హైదరాబాద్‌.
 • ఫేస్‌బుక్‌కు ఫస్ట్‌ అండ్‌ ఫేవరెట్‌ డెస్టినేషన్‌ హైదరాబాద్‌.
 • ఐటీ అంటే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కాదు, ఇన్‌క్రెడిబుల్‌ తెలంగాణ..
 • దీన్ని చేరుకునేందుకు కేసీఆర్‌ నాయకత్వంలో బృహత్తరమైన ప్రయత్నం చేస్తున్నాం

తయారీరంగంలో తిరుగులేదు..
ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఎదురులేదు.. ఫార్మా సెక్టార్‌లో ఫస్ట్‌ ఉన్నాం..
వ్యాక్సిన్‌ ప్రొడక్షన్‌లో ప్రపంచానికే రాజధానిగా మారిపోయాం.

 • నాడు ఉద్యమం… నేడు సంస్కరణోద్యమం
 • కేసీఆర్‌ నాయకత్వంలో దేశానికే దిక్సూచి
 • విమర్శించినోళ్లే.. నేడు ప్రశంసిస్తున్నారు
 • బ్యాక్‌ ఆఫీస్‌ నుంచి.. బ్యాక్‌ బోన్‌ స్థాయికి
 • రాష్ట్రంలో ప్రతి పల్లె ఓ ఆదర్శ గ్రామమే
 • మా ప్రభుత్వ ప్రతి చట్టం.. ప్రజల చుట్టం
 • ఐటీ.. అంటే ఇన్‌క్రెడిబుల్‌ తెలంగాణ
 • టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలు

కేసీఆర్‌ నాయకత్వంలో దేశానికే దిక్సూచి
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఒక ఎత్తయితే.. ఉజ్వల తెలంగాణ కోసం చేపట్టిన సంస్కరణోద్యమం దేశ చరిత్రలోనే మరొక సరికొత్త అధ్యాయమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు అభివర్ణించారు. సోమవారం టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో ‘పరిపాలన సంస్కరణలు, విద్యుత్తు పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతులు’ తీర్మానాన్ని కేటీఆర్‌ ప్రతిపాదిస్తూ ఏడేండ్ల కింద పుట్టిన యువ, నవ తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో దేశంలోనే సక్సెస్‌ఫుల్‌ స్టార్టప్‌గా నిలిచిందని చెప్పారు. కేసీఆర్‌.. అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని రైతులు చెప్పుకొంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఆసక్తికర పోలికలతో తెలంగాణ ప్రగతిని సభముందుంచారు. వాటిలో కొన్ని పంచ్‌లు..

- Advertisement -

హైదరాబాద్‌, అక్టోబర్‌ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధన ఒక ఎత్తు అయితే ఉజ్వల తెలంగాణ కోసం చేపట్టిన సంస్కరణోద్యమం దేశ చరిత్రలోనే మరొక సరికొత్త అధ్యాయం అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ ప్రజలకు ప్రయోజనం కలిగేలా సీఎం కే చంద్రశేఖర్‌రావు అనేక సంస్కరణలకు నాంది పలికారని చెప్పారు. అన్ని రంగాలు, అన్ని వర్ణాలకు స్వరాష్ట్ర ఫలాలను చేరువ చేసి, దేశానికే దిక్సూచిగా తెలంగాణ నిలిచేలా బాటలు వేశారని కీర్తించారు. సోమవారం టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో ‘పరిపాలనా సంస్కరణలు, విద్యుత్తు పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతుల’పై తీర్మానాన్ని కేటీఆర్‌ ప్రతిపాదించారు. తొమ్మిదోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నది. ఏ రకమైన కార్యక్రమాలు చేస్తే నవ భారతాన్ని నిర్మించవచ్చో సూచనలు ఇవ్వాలని అన్ని పార్టీల అధ్యక్షులను ప్రధానమంత్రి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నేను ఆ సమావేశానికి వెళ్లాను. ఆ రోజు వారికి ఒక్కటే చెప్పా. తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలో ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూసివ్‌ గ్రోత్‌ (త్రీ ఐ) మంత్ర నడుస్తున్నది. దేశవ్యాప్తంగా దీనిని అమలుచేస్తే కచ్చితంగా రాబోయే తరానికి కొత్త భారతదేశాన్ని అందించొచ్చు అని వివరించాను’ అని కేటీఆర్‌ వెల్లడించారు. పాలకులు, అధికారుల చేతిలో దశాబ్దాలుగా బందీ అయిన అధికారాన్ని ప్రజల చేతికి అందించడం, సంక్షేమ అభివృద్ధి ఫలాలు నిరాటంకంగా పేదవారికి, బలహీనులకు అందించడం, వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని కూకటివేళ్లతో సహా పెకళించడమే సంస్కరణల ఉద్దేశమని, ఆ సమున్నత ఆశయంతో సీఎం కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన సంస్కరణల్లో సువర్ణాధ్యాయాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. పరిశ్రమలు, ఐటీ, విద్యుత్తు రంగాల్లో తెలంగాణ అపూర్వ వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. ఏడేండ్ల కింద పుట్టిన యువ, నవ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ నాయకత్వంలో దేశంలోనే విజయవంతమైన స్టార్టప్‌గా నిలిచిందని చెప్పారు.

కేసీఆర్‌ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు
కేసీఆర్‌ అంటే కల్వకుంట చంద్రశేఖర్‌రావు మాత్రమే కాదని, కేసీఆర్‌ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని రైతులు అంటున్నారని కేటీఆర్‌ తెలిపారు. సంస్కరణలు అంటే అతుకుల బొంతలు కాదని, పరిపాలనలో కొత్త పుంతలు అని చూపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. స్థానిక యువతకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు దక్కేలా నూతన జోనల్‌ వ్యవస్థను తీసుకొచ్చారని, నియామకాల ప్రక్రియ పురోగతిలో ఉన్నదని చెప్పారు. ‘ఎస్సీ, ఎస్టీల ప్రగతి నిధి చట్టం, కొత్త రెవెన్యూ చట్టం, నూతన భూపరిపాలన చట్టం, కొత్త పంచాయతీరాజ్‌, కొత్త మున్సిపల్‌ చట్టం, టీఎస్‌ఐపాస్‌ పేరిట పారిశ్రామిక విప్లవానికి నాంది, బీ-పాస్‌ పేరుతో అవినీతి రహితంగా భవన నిర్మాణ అనుమతులు.. ఇలా అనేక చట్టాలు, సంస్కరణలు సీఎం కేసీఆర్‌ తెచ్చారు. మార్కెట్‌ కమిటీల్లో దళిత, బహుజన, మహిళల ప్రాతినిథ్యాన్ని పెంచేందుకు రిజర్వేషన్లు కల్పించే విప్లవాత్మక సంస్కరణకు నాంది పలికారు. పల్లె, పట్టణ ప్రగతి ప్రణాళికలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. గ్రీన్‌ బడ్జెట్‌ వంటి ఆలోచనలతో హరిత పల్లెలు, పట్టణాలుగా తీర్చిదిద్దుతున్నారు. కేసీఆర్‌ లిఖించిన ప్రతి సంస్కరణకు కేంద్ర బిందువు ప్రజలే. అందుకే అవి అద్భుత ఫలితాలు, విజయాలు సాధించాయి’ అని వివరించారు.

నాడు సంక్షోభం, నేడు సంక్షేమం
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్‌ అంటే సంక్షోభమని, నేడు కరెంట్‌ అంటే సంతోషమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సామాన్య ప్రజానీకం.. ఇలా ఏ రంగంలోనైనా ఇప్పుడు విద్యుత్తు వెలుగులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినాడు కేవలం 7,788 మెగావాట్ల స్థాపిత విద్యుత్తు సామర్థ్యం ఉంటే, అందులో 5,500 మెగావాట్లను మాత్రమే సరఫరా చేసే పరిస్థితి ఉండేదన్నారు. స్వల్ప కాలంలోనే 16,425 మెగావాట్ల స్థాపిత విద్యుత్తు సామర్థ్యానికి చేరుకున్నామని తెలిపారు. సోలార్‌ విద్యుత్తు రంగంలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉన్నదని, తలసరి విద్యుత్తు వినియోగంలో అగ్రగామిగా ఉన్నదని చెప్పారు. ఆ నాడు తెలంగాణ వస్తే ఉద్యోగాలు రావని, పరిశ్రమలు తరలిపోతాయని వెక్కిరించిన వారే, నేడు పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ మారిందని కీర్తిస్తున్నారని తెలిపారు. ఒకనాడు ఐటీ కంపెనీలకు బ్యాక్‌ ఆఫీస్‌గా ఉన్న తెలంగాణ, నేడు ఐటీ రంగానికి బ్యాక్‌ బోన్‌ అయిందని పేర్కొన్నారు.

రైతు కష్టం తెలిసిన నాయకుడు
సీఎం కేసీఆర్‌ రైతు కష్టం తెలిసిన నాయకుడని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దేశంలో రైతులకు రక్షణగా నిలిచిన ఏకైక నాయకుడని కొనియాడారు. ‘భూ రికార్డుల సమస్యలను సమూలంగా రూపుమాపేందుకు చేపట్టిన సంస్కరణలు దేశ చరిత్రలోనే ఒక సంచలనం. సీఎం కేసీఆర్‌ దార్శనికతతోనే అది సాధ్యమైంది. భూ రికార్డుల ప్రక్షాళన 95% పూర్తయింది. యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చింది. కేసీఆర్‌ చేపట్టిన సంస్కరణలు ఇతర రాష్ర్టాలకే కాకుండా దేశం మొత్తానికీ దిక్సూచిగా, మార్గదర్శిగా మారాయి. భూ పరిపాలనలో నూతన శకానికి ధరణి నాంది పలికింది. చట్టం ఎవరి చుట్టం కాదని అంటుంటారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెచ్చిన ప్రతి చట్టం తెలంగాణ ప్రజలకు చుట్టం. భూ రికార్డులను పక్కాగా తయారు చేసే లక్ష్యంతో డిజిటల్‌ విధానంలో సమగ్ర భూ సర్వే ఏడాది నిర్వహిస్తాం. అక్షాంశ, రేఖాంశాలతో స్పష్టమైన హద్దుల వివరాలతో పాస్‌ బుక్‌లు అందిస్తాం’ అని కేటీఆర్‌ తెలిపారు.

పిట్టకథలతో పెట్టుబడులు రావు
కట్టుకథలు, పిట్టకథలతో పెట్టుబడులు రావని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కఠోర పరిశ్రమతో అవినీతి రహితంగా అనుమతులు ఇస్తే, రెడ్‌ టేపిజాన్ని పక్కనపెట్టి, రెడ్‌ కార్పెట్‌తో వెల్‌కం చెబితే వస్తాయని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణది దేశంలోనే అగ్రభాగమని చెప్పారు. పరిశ్రమలంటే టాటాలు మాత్రమే కాదని, తాతల నాటి కులవృత్తులు కూడా పరిశ్రమలేనని గుర్తుచేశారు. ‘పరిశ్రమలంటే బిర్లాలు మాత్రమే కాదు, బోర్లాపడ్డ చిన్నత తరహా పరిశ్రమలు. వీటిని బాగుచేసేందుకు టీఆర్‌ఎస్‌ సర్కారు పెద్దపీట వేసింది’ అని వెల్లడించారు.

సమగ్ర కుటుంబ సర్వేతో మొదలు..
సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలకు ప్రాణాధారమైన సమాచారాన్ని సేకరించామని కేటీఆర్‌ తెలిపారు. ఒక్క రోజులోనే భారతదేశం అబ్బురపడేలా తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని గణాంకాలతో సహా సేకరించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని అన్నారు. రాష్ట్రంలో గడప గడపకూ సంక్షేమాన్ని తీసుకెళ్లే మహాయజ్ఞం సమగ్ర కుటుంబ సర్వేతోనే సాకారమైందని చెప్పారు. ‘పలు సందర్భంలో దేశంలోని ప్రముఖులను కలిసినప్పుడు ‘వాట్‌ బెంగాల్‌ థింక్స్‌ టుడే.. ఇండియా విల్‌ థింక్‌ టుమారో’ అనేవారు. అంటే బెంగాల్‌ ఈ రోజు ఆలోచించేది రేపు దేశం ఆలోచిస్తుందని చెప్పేవారు. కానీ నేడు కేసీఆర్‌ నాయకత్వంలో ‘వాట్‌ తెలంగాణ డజ్‌ టుడే.. ఇండియా డజ్‌ టుమారో’ (ఈ రోజు తెలంగాణలో జరిగేది రేపు దేశంలో జరుగుతుంది) అనే పేరును సాధించాం’ అని పేర్కొన్నారు. అన్ని రాష్ర్టాలకు సీఎంలు ఉంటారని, కానీ మన రాష్ర్టానికి మాత్రమే రాష్ర్టాన్ని సాధించిన సీఎం ఉన్నారని కేటీఆర్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదర్శ గ్రామ పంచాయతీ అంటే వరంగల్‌ పక్కన ఉండే గంగదేవిపల్లిని చూపించేవారని, నేడు తెలంగాణలో ప్రతి పల్లె ఆదర్శ పల్లెగా మారిందని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణను సీఎం కేసీఆర్‌ అత్యున్నత స్థానంలో నిలిచేలా చేశారని ప్రశంసించారు. శాసనసభ్యులకు గౌరవాన్ని పెంచేలా దేశంలోనే మొదటిసారి ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసులను నిర్మించినట్టు చెప్పారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement