హైదరాబాద్, ఆగస్టు14 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రిజర్వాయర్లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాల్లో ఏపీకి వాటానే లేదని తెలంగాణ సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ రమేశ్‌బాబు తాజాగా లేఖ రాశారు. బేసిన్ పారామీటర్స్ ఆధారంగా కృష్ణా జలాల్లో తెలంగాణకు 71 శాతం, ఏపీకి 29శాతం వాటా ఇవ్వాలనే 19వ బోర్డు సమావేశంలో ఇప్పటికే ప్రతిపాదించామని వెల్లడించారు.
ప్రస్తుతం శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లలో కేవలం 146 టీఎంసీలు మాత్రమే వినియోగానికి అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. బేసిన్ పారామీటర్స్ ప్రకారం ఆ జలాలన్నీ తెలంగాణకే దక్కుతాయని, ఏపీకి ఎలాంటి వాటా లేదని తెలంగాణ ఈఎన్సీ తెలిపారు. వచ్చే ఆగస్టు వరకు కేవలం తాగునీటి కోసమే తెలంగాణకు 50 టీఎంసీలు కావాలని తెలిపారు. శ్రీశైలం నుంచి 10 టీఎంసీలు, ఎన్ఎస్పీ కింద 15, ఏఎమార్పీ కింద 25 టీఎంసీలు అవసరమని వివరించారు. ఆమేరకు జలాలను కేటాయించాలని బోర్డు చైర్మన్‌కు రాసిన లేఖలో ప్రతిపాదించారు.