తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 18: దళితుల జీవితాలలోనే కాకుండా తాడిత పీడిత సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపి దేశానికే దిక్సూచిగా నిలబడిన అంబేద్కర్ నిజమైన సూర్యుడు అని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. విప్లవకవి, రచయిత కేజీ సత్యమూర్తి (శివసాగర్) రాసిన ‘అంబేద్కర్ సూర్యుడు’ పుస్తకావిష్కరణ సభ రవీంధ్రభారతిలో శనివారం సాయంత్రం తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ అధ్యక్షతన జరిగింది. అంబేద్కర్ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో చేసిన కృషిని లింబాద్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ దేశానికి బుద్ధుడు-అంబేద్కర్ చాలడు మార్క్స్ కావాలని, అంబేద్కర్ను అవమానపరిచిచే విధంగా రంగనాయకమ్మ రాసిన పుస్తకాన్ని చీల్చి చెండాడిన గొప్ప విప్లవ రచయిత శివసాగర్ అని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. దేశానికి దశ-దిశను నిర్ధేశించిన నిజమైన సూర్యుడు అంబేద్కర్ అని తెలంగాణ మెడికల్ సర్వీసెస్-ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ అన్నారు. డిక్కీ జాతీయ అధ్యక్షులు నర్రా రవి కుమార్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు మహేష్, సమతా సైనిక్ దళ్ అధ్యక్షులు దిగంబర్ కాంబ్లే, అంసా రాష్ట్ర అధ్యక్షులు అంగరి ప్రదీప్, ప్రధాన కార్యదర్శి మంచాల లింగస్వా మి, ఓయూ జేఏసీ అధ్యక్షులు ఎల్చల దత్తాత్రేయ, హరీష్ గౌడ్, పి.రాజు, తాడెం కృష్ణ, దేవేందర్, యాదగిరి, చేతన్ పాల్గొన్నారు.