హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విడుదల కానున్న కొత్త సినిమాల టికెట్ ధరల పెంపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు థియేటర్ల యజమానులు చేసుకొన్న దరఖాస్తులను అనుమతించాలని బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది. ఈ సమస్య చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నదని, ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నామని జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అఖండ, ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, రాథేశ్యాం, పుష్ప సినిమా టికెట్ల ధరలను పెంచాలన్న తమ దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై సానుకూలంగా స్పందించాలని కోరుతూ లలిత, చంద్రకళ, శశికళ తదితర థియేటర్ల యజమానులు పిటిషన్లు దాఖలు చేయడంతో హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీచేసింది.