హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఉద్యోగులు, పెన్షనర్లకు కరువుభత్యం(డీఏ) మంజూరు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. డీఏను 1.944% పెంచాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. శనివారం ప్రజాభవన్లో సహచర మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి విద్యుత్తు ఉద్యోగులకు డీఏను ప్రకటించి ప్రసంగించారు.
పెంచిన డీఏ విద్యుత్తు ఉద్యోగులతోపాటు, పెన్షనర్లు, ఆర్టిజన్లకు కూడా వర్తిస్తుందని వెల్లడించారు. ఈ నిర్ణయంతో డీఏ 14.074% నుంచి 16.018శాతానికి పెరుగుతుందని తెలిపారు. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.