హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, కనీస ధరను అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ కార్మికులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. దాదాపు 3.90 లక్షల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఓలా, ఉబర్, ర్యాపిడో, క్యాబ్, ఆటో డ్రైవర్లతో పాటు గూడ్స్ ఆటో డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, పోర్టర్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల డెలివరీ కార్మికులు సమ్మెలో భాగస్వాములయ్యారు.
దీంతో రవాణా, హోమ్ డెలివరీ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రవాణా సేవలకు కనీస ధర ఉండాలని, కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, కంపెనీలు ఏకపక్షంగా కమీషన్లు నిర్ణయించకుండా, మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2025 ప్రకారం కనీస చార్జీలను అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఆగస్టు 8 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడుతామని హెచ్చరించారు. సమ్మెలో బీఆర్టీయూ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వరర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అత్తినమోని నాగేష్ కుమార్, టీఏడీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ రవిశంకర్, జనరల్ సెక్రటరీ సంతోష్, డబ్ల్యూకేజీ అధ్యక్షుడు పీ ఈశ్వర్ప్రసాద్ పాల్గొన్నారు.