సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలో పనిచేసే కంపెనీకే కన్నం వేసి కిలోకు పైగా బంగారాన్ని కాజేసిన ఇద్దరిని నగర కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ బృందం, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. బుధవారం సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కర్ణాటకకు చెందిన సున్ కాంబ్లే హరీశ్ గురుకృప ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగబాధ్యతల్లో భాగంగా అతడు కృష్ణ పెరల్స్, శ్రీ జువెల్లర్స్, అపర్ణ జువెల్లర్స్, జోయలుక్కాస్, మానేపల్లి జువెల్లర్స్ వంటి ప్రముఖ రిటైల్ జ్యువెలరీ షాపులను సందర్శించేవాడు. వారికి నూతన డైమండ్, గోల్డ్ డిజైన్లను చూపిస్తూ ఆర్డర్లు తీసుకుని డెలివరీ చేసేవాడు. అనంతరం వారి నుంచి చెక్కులు సేకరించి ఆఫీసులో సమర్పించేవాడు.
ఈ క్రమంలో కంపెనీకి చెందిన బంగారు ఆభరణాలను లాకర్లో భద్రపరచడం హరీశ్ గమనించాడు. తన ఆర్థిక ఇబ్బందుల వల్ల, వ్యక్తిగత అవసరాల కోసం కంపెనీలోని బంగారం దొంగిలించాలని పథకం వేశాడు. ఇందుకోసం హైటెక్ సిటీలో పనిచేసే తన సోదరుడు ఆకాశ్‌ను భాగస్వామిగా చేసుకున్నాడు. జూలై 16న ఆఫీసు వద్ద రెక్కీ నిర్వహించి చోరీకి విఫలయత్నం చేశారు. మర్నాడు రాత్రి ఇద్దరూ ఆఫీసుకు విద్యుత్ సరఫరా నిలిపివేసి, బాత్రూమ్ గ్రిల్స్ విరగ్గొట్టి లోపలికి ప్రవేశించాడు. లాకర్ తెరిచి అందులో ఉన్న 1.028 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
అనంతరం ఆ ఆభరణాలను తన సోదరుడు ఆకాశ్‌కు ఇవ్వగా దాచిపెట్టాడు. నేరం చేసే సమయంలో నిందితులు తమను కనిపెట్టకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు డీసీపీ వివరించారు. కంపెనీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌తోపాటు కొన్ని సాంకేతిక ఆధారాలతో నిందితులను మంగళ్‌హట్‌లో పట్టుకున్నారు. వారి నుంచి చోరీకి గురైన మొత్తం 1.028 కిలోల బంగారం(7 గొలుసులు, 7 జతల కమ్మలు)ను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ అరెస్ట్‌లో టాస్క్‌ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్ ఇన్స్పెక్టర్ ఛత్రాసింగ్ యాదేందర్, ఎస్ఐ మహ్మద్జాహెద్ తదితరులు పాల్గొన్నారు.