హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): టీకాలు, జనరిక్ ఔషధాలతోపాటు క్యాన్సర్, ఇతర సంక్లిష్ట వ్యాధు ల నివారణకు అవసరమైన బయోసిమిలర్స్ ఉత్పత్తిలో ప్రపంచ గమ్యస్థానంగా తెలంగాణ వృద్ధి చెందిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో మరింత ముందడుగు వేసే దిశగా ప్రస్థానం కొనసాగుతోందని తెలిపారు. మంగళవారం మాదాపూర్లోని ఓ హోటల్లో ఇండో-బెల్జియం లైఫ్ సైన్సెస్ సదస్సును ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 33% వ్యాక్సిన్లు, జనరిక్ ఔషధాలు తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయన్నారు. కొత్త అవకాశాలతో బెల్జియం కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 24-26 మధ్య హైదరాబాద్లో జరగనున్న బయో ఏషియా సదస్సులో ఇకడికి వచ్చిన ప్రముఖులంతా పాల్గొనాలని కోరారు. ఈ సదస్సుకు బెల్జియం రాయబారి డిడియర్ వాండర్హాసెల్ట్, డాక్టర్ రెడ్డీస్ ఎండీ జీ.వీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.