హైదరాబాద్, ఆట ప్రతినిధి : గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం(టీడీసీఏ) అండర్-17 టోర్నీ సోమవారం అట్టహాసంగా మొదలైంది. సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి, టీడీసీఏ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి టోర్నీని ప్రారంభించారు. దోమలగూడ ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ గ్రౌండ్లో మొదలైన ఈ టోర్నీ ద్వారా మెరికల్లాంటి క్రికెటర్లను గుర్తించనున్నారు. ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు చెందిన టీమ్‌లతో పాటు టీడీసీఏ-లెవెన్ ఈ టోర్నీలో పోటీపడుతున్నాయి. ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ‘తెలంగాణలో గ్రామీణ క్రికెటర్లకు సరైన అవకాశాలు లభించడం లేదు. రాష్ట్రంలో జిల్లాల క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ టోర్నీలో సత్తాచాటిన వారిని ఎంపిక చేసి అమెరికా క్రికెట్ అకాడమీ టీమ్‌తో మ్యాచ్‌లు ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు.