హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ సైబర్ ముఠాతో చేతులు కలిపి, భారతీయ పౌరుల నుంచి కోట్లు కొల్లగొడుతున్న ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) ఛేదించినట్టు డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు. అక్రమంగా సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ అష్రఫ్ అలీ, సయ్యద్ సోహైల్, అతీక్ అహ్మద్, హన్మకొండకు చెందిన నూనె అశోక్, యూపీకి చెందిన రిజ్వాన్ ఉన్నారు. గత నెల 31న శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 198 సిమ్ కార్డులతో కంబోడియాకు వెళ్లేందుకు యత్నించిన అష్రఫ్ అలీని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుని విచారించగా.. ఈ భారీ స్కామ్ వెలుగు చూసింది.
ఈ ముఠా ఇప్పటి వరకు 600కు పైగా సిమ్ కార్డులను విదేశాలకు తరలించినట్టు వెల్లడించారు. 2023లో నిందితుడు అష్రఫ్ దుబాయ్‌లో పనిచేస్తున్న సమయంలో గేమింగ్ కాల్ సెంటర్లో పనిచేస్తున్న రిజ్వాన్‌తో పరిచయం ఏర్పడినట్టు వివరించారు. భారతీయ సిమ్ కార్డులు ఇస్తే భారీగా డబ్బులు ఇస్తామని రిజ్వాన్ ఆఫర్ చేశాడు. దీంతో అష్రఫ్ అమాయకుల వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు సిమ్ కార్డులు సేకరించేవాడు. అరెస్ట్ అయిన వారిలో సోహైల్ జియోలో ప్రమోటర్‌గా, అతీక్, అశోక్ ఎయిర్టెల్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. తమకున్న అధికారాలతో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఈ కార్డులను యాక్టివేట్ చేసి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు.