
హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న అహంతో బెదిరింపులకు పాల్పడితే తాము భయపడబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీకి స్పష్టంచేశారు. అవినీతికి పాల్పడి, తప్పులు చేసే ఖర్మ తమకు లేదని తేల్చిచెప్పారు. బీజేపీని విమర్శించేవారిపై ఐటీ దాడులు చేయటం కేంద్రప్రభుత్వానికి పరిపాటిగా మారిందని మండిపడ్డారు. కష్టపడి కొనుక్కొన్న క్షేత్రంలో తాము వ్యవసాయం చేసుకొంటున్నామని, తమకు దొంగసొమ్ము అక్కరలేదని తేల్చిచెప్పారు. ప్రగతిభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ప్రాజెక్టులు కట్టకపోతే కట్టలేదంటున్నారు. కడితే కమీషన్లు తీసుకుంటున్నరని నిందలు వేస్తున్నారు. అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించి వారి మనసులను కలుషితం చేస్తున్నారు. ఇన్నాళ్ల్లు ఇష్టమొచ్చినట్టు వాగిన్రు. ఇక నడువది బిడ్డా. మా హద్దులు మాకు తెలుసు. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. అధికార దుర్వినియోగం చేసి అడ్డగోలుగా చేద్దామనుకుంటే మీరే గోల్మాల్ అయితరు’ అని బీజేపీని హెచ్చరించారు. ‘మేము తప్పులు చేయం. ఆ ఖర్మ కూడా లేదు. శక్తియుక్తులుంటే తోచినకాడికి ప్రజలకు మంచి చేస్తం. చేసినం కూడా’ అని పేర్కొన్నారు. ఏ అంశంపై అయినా, ఎలాంటి ఎంక్వైరీలకైనా సిద్ధమని స్పష్టంచేశారు.
మా ఎంపీల మీద ఐటీ, ఈడీ దాడులు చేస్తారట
దేశంలో చాలామంది ఎంపీలపై ఐటీ, ఈడీ దాడులు చేశారని, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలపై కూడా జరుగుతాయని బండి సంజయ్ చెప్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ఇతర పార్టీల ఎంపీల మీద కూడా ఐటీ, ఈడీ దాడులు జరుగుతాయని, బీజేపీ ఎంపీలపై మాత్రం జరగవని బండి సంజయ్ మీడియా సమావేశంలోనే చెప్పారని గుర్తుచేశారు. ఇలాంటి దాడులు దేశంలో పరంపరగా చేస్తున్నారని, దేశమంతా ఈ మాట కామన్ టాక్ అయిందని అన్నారు. ఇట్లనే చేస్తే పరిస్థితి బీజేపీకే బూమరాంగ్ అయితదని హెచ్చరించారు.
మాకు దొంగ వ్యాపార్లేవ్
తాము వ్యవసాయం చేసుకొని కష్టపడి బతుకుతున్నామని, దొంగలెక్కలపై బతికేటోళ్లం కాదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ‘బాజాప్తా భూములు కొనుక్కుని, 100 ఎకరాల్లో నేను, నా కొడుకు వ్యవసాయం చేసుకుంటున్నాం. ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్‌లో కూడా చూపిస్తున్నం. నీ అడ్డగోలు మాటలకు భయపడేవాళ్లం కాదు. యుద్ధవీరులం. ఇప్పటికైనా ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు. తమాషాగా మాట్లాడితే మెడలు వంచుతం’ అని బండి సంజయ్‌ని హెచ్చరించారు. ‘సిద్దిపేటలో ఇప్పుడు హరీశ్‌రావు ఉంటున్న ఇల్లు గతంలో నేను కట్టుకున్న. దాన్ని ఒకాయనకు ఇస్తే, ఆయన నాకు జాగ ఇచ్చిండు. దానిని అమ్ముకుంటే రూ.16-17 కోట్లు వచ్చినయి. ఫాంహౌస్‌లో రూ.2.50 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్న. రూ.3.70 కోట్లు ఇన్‌కం టాక్స్ కట్టిన. మేము దొంగ లెక్కల మీద బతికేటోళ్లం కాదు. మాకు దొంగ సొమ్ము అక్కర్లేదు. అందుకే ఎవరికీ భయపడం. నీ తాటాకు చప్పుళ్ళకు భయపడేదిలేదు. నాకు మనీ లాండరింగుల్లేవు, బోండరింగుల్లేవు, కంపెనీల్లేవు, దొంగ వ్యాపారాల్లేవు, మమ్మల్ని ఏమీ చేయలేరు’ అని తేల్చిచెప్పారు. వాళ్లను, వీళ్లను బెదిరించినట్టు బెదిరిస్తే భయపడేది లేదని, తాము నిఖార్సుగా ఉన్నామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.