హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు భగ్గుమంటున్నాడు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో సోమవారం 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే 15 రోజుల్లో ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 45 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ముఖ్యంగా ఈనెల 16 నుంచి 20వరకు మధ్య ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వేడిగాలులు విపరీతంగా వీస్తాయని వివరించింది.
అదేవిధంగా రాబోయే రెండ్రోజులు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువవచ్చని పేర్కొన్నది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రజలు బయటకు వెళ్లే సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.