హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగిందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. సంపద పెంచాలి..పేదలకు పంచాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. బడ్జెట్లో సంక్షేమరంగానికి 92 వేల కోట్లు కేటాయించడం పేదల ప్రజల అభ్యున్నతి పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రశంసించారు. 90 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం సాహసోపేత నిర్ణయమని కొనియాడారు. గురువారం శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ పేద, బడుగు, బలహీనవర్గాల సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పారు. ఉద్యమ నాయకుడే రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడం తెలంగాణకు రక్షణ అని, ఎనిమిదేండ్ల ప్రగతి నిరూపిస్తున్నదని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంతో ప్రస్తుత పరిస్థితులను పోలిస్తే నాడు తెలంగాణ ఎంత అన్యాయానికి గురైనదో అర్థమవుతున్నదని చెప్పారు. బడ్జెట్ పుస్తకంలోని ప్రతి పేజీని చదవాలని సభ్యులకు సూచించారు. దళితబంధు పథకానికి రూ.17 వేల కోట్లు కేటాయించడం పట్ల దళితుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. టీఎస్‌ప్రైడ్ పథకం కింద దళిత యువకులకు పంపిణీ చేసిన వాహనాలకు సంబంధించిన సబ్సిడీని ఈ నిధుల నుంచి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం స్వరూపం మారిందని అన్నారు. బడ్జెట్లోనూ, ఉద్యోగాల భర్తీలోనూ విద్యాశాఖకు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తంచేశారు.
దక్షిణాది రాష్ర్టాల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని కడియం శ్రీహరి విమర్శించారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఏర్పాటుతో నదీజలాలపై పెత్తనం చెలాయించేందుకు కుట్ర పన్నుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. శాస్త్రీయ అవగాహన, మదింపు లేకుండా తెలంగాణను ఎండబెట్టే కుట్రలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ నేతలకు తెలంగాణపై ప్రేమ ఉంటే విద్వేష రాజకీయాలు పక్కనబెట్టి, అభివృద్ధిలో కలిసిరావాలని హితవు చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టిన బీజేపీ నాయకులకు సీఎం కేసీఆర్‌ను విమర్శించే అర్హతలేదని మండిపడ్డారు. తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్.. జాతీయస్థాయిలో బీజేపీ సంగతి తేల్చేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.