KP Vivekananda | హ్యాట్రిక్ విక్టరీకి సిద్ధమవుతున్నట్టున్నారు..
మా కుత్బుల్లాపూర్ ప్రజలు మొదటి స్థానాన్ని బీఆర్ఎస్కు రిజర్వ్ చేశారు. రెండోస్థానం కోసం మిగతా పార్టీలు కుస్తీ పడుతున్నాయి. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం.
కేపీ వివేకానందకు ఎందుకు ఓటు వేయాలి?
ఈ ప్రశ్నకు సమాధానం చాలా పెద్దగా చెప్పాల్సి ఉంటుంది. కానీ, చిన్న ఉదాహరణ చెప్తా! కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం. మినీ ఇండియాగా అభివర్ణించొచ్చు. అన్ని రాష్ర్టాలకు చెందిన ప్రజలూ ఇక్కడ కనిపిస్తారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ జీవించడానికి అనువైన వాతావరణాన్ని కుత్బుల్లాపూర్లో డెవలప్ చేశాం. ఒకప్పుడు ఒకటే మండలం ఉండేది. ఇప్పుడు మూడు మండలాలు, మూడు మున్సిపాలిటీలు చేసుకున్నం.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి కేపీ ఏం చేశారు?
కుత్బుల్లాపూర్లో ఒకప్పుడు ట్యాంకర్లు క్యూలు కడుతుండే! ఇప్పుడు ఇంటింటికీ నల్లా వచ్చింది. ఆగకుండా నీళ్లొస్తున్నయ్. ఇక్కడ ఉండేవాళ్లలో కార్మికులు, కష్టజీవులే అధికం. సుస్తీ చేస్తే వందలు, వేలు ఖర్చు చేయలేరు. వారి కోసం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశాం. ఐదువేల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినం. రేపుగెలిచాక మరిన్ని ఇస్తం.
మొన్న కూన శ్రీశైలం గౌడ్ మీద చేయి చేసుకున్నారు.. ఎందుకు అంత దూకుడు?
బీజేపీ నేతగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఆ వ్యక్తి తన స్థాయి మరచిపోయి మాట్లాడారు. ఈ లోకంలో లేని నా తండ్రి మీద కామెంట్లు చేశారు. ఆగలేకపోయా! బట్.. అలా చేసి ఉండకూడదు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల గురించి మీ కామెంట్..
ఇన్నేండ్లూ ఏం చేయలేకనే ఇప్పుడు గ్యారంటీలు అని మోసం చేస్తున్నారు. మేమిచ్చిన ప్రతి హామీనీ నిలబెట్టుకున్నం. మా నాయకుడు మ్యానిఫెస్టోలో పేర్కొనని సంక్షేమ పథకాలు కూడా అమలు చేసి చూపించారు. కాంగ్రెసోళ్లు ఇచ్చే గ్యారంటీలకు వారంటీ ఉండదు.
ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయంటారు?
నా మాట కన్నా.. ఈ రోజు సోషల్ మీడియాలో ఒక పాట బాగా వైరల్ అవుతుంది. ‘కేసీఆర్ పిలుపున్నదిర రామక.. తెలంగాణ గెలుపున్నది రామక’ పాట ఎన్నికల ఫలితాలను చెబుతున్నది. తెలంగాణ అంటే బీఆర్ఎస్. రాష్ర్టాన్ని తెచ్చినం. అభివృద్ధి చేస్తున్నం. మళ్లీ గెలుస్తున్నం.