‘ఆస్తుల పెంపుపై అభినందనలు’!!
నష్టాల్లో ఉన్న మెడికవర్ గ్రూప్ మూడేండ్లలో 13,200 కోట్లకు ఆస్తుల్ని పెంచుకోవడంపై సీఎం రేవంత్‌కు అభినందనలు తెలియజేస్తూ సికింద్రాబాద్ దవాఖాన వద్ద ఆదివారం వెలిసిన ఫ్లెక్సీ ఇది.

రేవంత్ ఫ్యామిలీ పెట్టుబడుల వల్లే అక్రమాస్తులు సమకూరాయంటూ బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆధారాలు బయటపెట్టిన నేపథ్యంలో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు కలకలం రేపింది.
హైదరాబాద్ సిటీబ్యూరో/మారేడ్‌పల్లి, అక్టోబర్ 4 : సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ ముందు ఆదివారం ఉదయం వెలిసిన ప్లెక్సీలు కలకలం రేపాయి. మెడికవర్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ శరత్‌రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అల్లుడు సత్యనారాయణరెడ్డి డైరెక్టర్‌గా ఉన్న మ్యాక్స్ బీన్ ఫార్మాలో భాగస్వామిగా ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు కొద్దిరోజుల క్రితం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మెడికవర్ హాస్పిటల్, మ్యాక్స్ బీన్ ఫార్మా మధ్య ఉన్న సంబంధాలు వెల్లడించాలంటూ డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో రూ. 13,200 కోట్ల బాగోతానికి సంబంధించిన ఫ్లెక్సీలు హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో వెలిశాయి. సమాచారం అందుకున్న గోపాలపురం పోలీసులు అక్కడికి చేరుకుని ఫ్లెక్సీలను తొలగించారు. జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కంటోన్మెంట్, పికెట్ ప్రాంతానికి చెందిన సాయికిరణ్, వినీత్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నట్టు తెలిసింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేయడంపై గులాబీవర్గాలు మండిపడుతున్నాయి.
ప్రశ్నించడమే నేరమా! ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? దేవాలయానికి వెళ్తున్న సాయికిరణ్‌ను మార్గమధ్యంలో అదుపులోకి తీసుకోవడం అన్యాయం. సాయికిరణ్, వినీత్ ఏం నేరం చేశారో చెప్పాలి. వారేమైనా ఉగ్రవాదులా?

పోక్సో కేసులో వారం రోజులవుతున్నా అరెస్టు చేయించాలనే సోయిలేని ప్రభుత్వం.. కేవలం ఫ్లెక్సీలు పెట్టినంతమాత్రాన అప్పటికప్పుడే అరెస్టు చేయించడం వారి అధికార దుర్వినియోగానికి అద్దం పడుతున్నది. – మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ నేత