హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ అసమర్థత తెలంగాణ రైతాంగం కొంపముంచింది. నిరంతరాయంగా కరెంటును సరఫరా చేయకపోవడంతో ఎత్తిపోతల పథకాలు నామమాత్రంగా మారాయి. వరద వచ్చినా ఎత్తిపోయలేక చతికిలపడ్డాయి. ఫలితంగా నదీజలాలు దిగువకు జారిపోగా, తెలంగాణ కరువుబారిన పడింది.
ప్రస్తుత దుర్భర పరిస్థితులకు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమే ప్రధాన కారణమని నిపుణులు తేల్చి చెప్తున్నారు. బిల్లులను చెల్లించాలని, లేదంటే కరెంటివ్వలేమని ఏడాదిగా విద్యుత్తు శాఖ స్పష్టం చేస్తున్నా.. పట్టించుకోకుండా సర్కార్ నిర్లక్ష్యం వహించడం తెలంగాణ రైతాంగానికి శాపంగా మారింది. మరోవైపు ఆన్ అండ్ అఫ్ విధానంతో పంపులు దెబ్బతింటాయని ఇరిగేషన్ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ గత ఏప్రిల్ నుంచే హెచ్చరిస్తున్నది. లోటు వర్షపాతమే ఉంటుందని నివేదికలు నొక్కిచెప్పాయి. అదీగాక సాధారణంగానే ఎత్తిపోతల పథకాలు ఏడాదిలో 90నుంచి గరిష్ఠంగా 180 రోజుల వరకు మాత్రమే పనిచేస్తాయి. నీటి వనరుల్లో వరద ప్రవాహాలు కొనసాగిన సమయంలోనూ నిరంతరాయంగా పనిచేయాలి. అప్పుడే ఆయా రిజర్వాయర్లను నింపే అవకాశం ఉంటుంది. కానీ ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో వరద తగ్గే అవకాశం ఉంటుందని హెచ్చరించినా రేవంత్ సర్కార్ పట్టించుకోలేదు. జూరాల ప్రాజెక్టుకు ఈ ఏడాది దాదాపు 250 టీఎంసీలకు పైగా వరదనీరు వచ్చింది.
అక్కడ నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమాతోపాటు జూరాల ప్రాజెక్టు కాలువల ద్వారా ఆ జలాలను వినియోగించుకునే అవకాశమూ వచ్చింది. కానీ రేవంత్‌రెడ్డి సర్కార్ ఆయా పంపులను మాత్రం నడుపలేదు. ఒక్కపూట మాత్రమే కరెంటివ్వడంతో ఆయా పంప్‌హౌస్‌లను పూర్తిస్థాయిలో నడుపలేని దుస్థితి. ఉదయం వేళనైనా నిరంతరాయంగా సరఫరా చేసిందా అంటే అదీ లేదు. గంట, రెండు గంటలు సరఫరాను నిలిపివేస్తూ ఇవ్వడంతో ఎత్తిపోతలు నామమాత్రంగానే కొనసాగాయి. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు పంపులను నడుపకపోవడంతో వరదను ఒడిసిపట్టలేదు.
దీంతో జూరాల నుంచి దిగువకు వరద జలాలు తరలిపోయాయి. ఇలా ఏపీ సర్కార్ కృష్ణా జలాలను కొల్లగొట్టేందుకు స్వయంగా రేవంత్ సర్కారే అవకాశం ఇచ్చినట్టయింది. కల్వకుర్తి పంపులను కూడా సామర్థ్యం మేరకు నడిపిందీ లేదు. మరోవైపు ఏపీ మాత్రం జూరాల నుంచి దిగువకు శ్రీశైలం జలాశయానికి వచ్చిన వరదను వచ్చినట్టుగా మళ్లించుకుపోయింది. దాదాపు పోతిరెడ్డిపాడు ద్వారా 54టీఎంసీలను, వెలిగొండ ద్వారా మరో 7టీఎంసీలను తరలించింది. తెలంగాణ ప్రభుత్వం ఆన్ అండ్ ఆఫ్ విధానంలో కరెంటివ్వడం వల్లే వరదను ఒడిసి పట్టలేకపోయామనేది అధికారులు సైతం వెల్లడిస్తున్నారు. ప్రస్తుత కరువు పరిస్థితులకు ప్రభుత్వ విధానమే కారణమని తేల్చిచెప్తున్నారు.
రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంలో ప్రధానంగా ఏఎమ్మార్పీ, కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు, కల్వకుర్తి, రాజీవ్‌భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, అలీసాగర్, గుత్పా, చౌటుపల్లి హన్మంతరెడ్డి, దేవాదుల తదితర పంపింగ్ స్టేషన్లు అత్యంత కీలకం. ప్రధాన ఆయకట్టు ఆయా పంప్‌హౌస్‌ల దిగువనే ఉన్నది. ఇవిగాక అనేక లిఫ్ట్ స్కీమ్‌లు సైతం ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ఆయా పంపింగ్స్టేషన్లకు సంబంధించిన బిల్లులను విడుదల చేయడం లేదు. విద్యుత్తు సప్లయ్‌కు సంబంధించి బిల్లులే దాదాపు రూ.27,027 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
అవిగాక ఇప్పటికే పూర్తయిన లిఫ్ట్ స్కీమ్‌లకు సంబంధించి పనులకు గాను రూ.863.51 కోట్లు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులకు సంబంధించి పంప్‌హౌస్‌ల నిర్మాణం, కరెంటు సరఫరా కోసం రూ.3,900.81 కోట్లు.. ఇవి మొత్తంగా రూ.4,764.32 కోట్లు కాగా, విద్యుత్తు బిల్లులతో కలిపి మొత్తంగా 33,653కోట్ల నిధులను ట్రాన్స్‌కోకు ఇరిగేషన్ శాఖ చెల్లించాల్సి ఉన్నది. పంపింగ్ స్టేషన్ల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌కు సంబంధించి రూ.1,745 కోట్లు బకాయిలు ఉన్నాయి. అందులో అత్యవసరంగానైనా కనీసం రూ.500 కోట్లను చెల్లించాలని ట్రాన్స్‌కో సుదీర్ఘకాలంగా ఇరిగేషన్ శాఖకు, ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నది.
అయినా ప్రభుత్వం పెడచెవిన పెడుతుండటంతో.. బకాయిలిస్తే తప్ప కరెంటును ఇవ్వబోమని ట్రాన్స్‌కో విభాగం ఇరిగేషన్ శాఖకు గత సీజన్లోనే తెగేసి చెప్పింది. అయితే, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, బిల్లుల చెల్లింపుపై హామీ ఇవ్వడంతో 24 గంటలకు బదులు 12 గంటల పాటే, అదీ పగటిపూట మాత్రమే ఇచ్చేందుకు షరతుపై ఒప్పుకొన్నది. ఇలా గత సీజన్లో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు పగటిపూటే విద్యుత్తును సరఫరా చేయడం కొనసాగించింది. దీంతో ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలోనే నీటినిల్వలు ఉన్నా లిఫ్ట్ పథకాలు నిర్దేశితలక్ష్యం మేరకు నీటిని ఎత్తిపోయలేని దుస్థితి నెలకొన్నది. ఫలితంగా పలుచోట్ల కీలక దశలో సాగునీరందక పంటలు ఎండిపోయాయి.
ట్రాన్స్‌కో తీరుపై ఇరిగేషన్ శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఆన్ అండ్ ఆఫ్ విధానంలో కరెంటును సరఫరా చేయడం వల్ల రూ.వేల కోట్ల విలువైన పంపులు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఆన్ అండ్ ఆఫ్ విధానంలో 28 పంపింగ్స్టేషన్లు పనిచేస్తున్నాయని తెలిపారు. వర్షాకాలంలో అంటే జూలై నుంచి అక్టోబర్ వరకు, వానకాలం ముగిసిన వెంటనే అంటే మార్చి వరకు ఈ షెడ్యూల్ సాధ్యపడదని, ఎందుకంటే, నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం అప్పుడే ఉంటుందని పేర్కొన్నారు.
పంపింగ్ చేయాల్సిన నీటి పరిమాణం, పంపుల సామర్థ్యం, సంఖ్య కారణంగా, చివరి ఆయకట్టు ప్రాంతానికి అవసరమైన నీటిని అందించాలంటే పంపింగ్‌స్టేషన్ కింద ఉన్న చెరువులు, రిజర్వాయర్లను నింపాల్సి ఉంటుందని, అందుకు 24 గంటలు పంపింగ్ అవసరమని స్పష్టం చేస్తున్నారు. దాదాపు 35 పంపింగ్స్టేషన్లకు ఈ విధమైన ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ పనిచేయబోదని వెల్లడిస్తున్నారు. ఎందుకంటే ఆయా పంపులు అధిక డిశ్చార్జ్, 10 మెగావాట్ల కంటే ఎకువ రేటింగ్ కలిగి ఉన్నాయని, 10 కి.మీ. పొడవైన లైనింగ్ లేని ఇన్‌టేక్ కాలువలు ఉంటాయని, ప్రెషర్ మెయిన్లు, పొడవైన నీటి సరఫరా వ్యవస్థ ఉంటుందని వివరిస్తున్నారు.
ఖాళీ ప్రెషర్ మెయిన్‌తో పంపును ప్రారంభిస్తే ప్రతిసారీ అధిక ప్రకంపనలు ఉంటాయని, పదేపదే స్టార్ట్-స్టాఫ్ ఆపరేషన్లు చేయడం వల్ల అది మోటర్ పనితీరుపై దుష్ప్రభావం చూపడమేగాక అందులోని కీలకమైన ఇంపెల్లర్లతోపాటు, షాఫ్ట్‌లు, బేరింగ్లు, షియర్ మెకానిజమ్ దెబ్బతినే ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు. ఆన్ అండ్ ఆఫ్ విధానం వల్ల తలెత్తిన ప్రకంపనల వల్ల మేడారం పంపింగ్ స్టేషన్, రామడుగు పంపింగ్ స్టేషన్‌లోని పలు పంపుల ఇంపెల్లర్లు దెబ్బతిన్నాయని ఆ శాఖ ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.