Layoffs | ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు 23,154 మంది ఉద్యోగులను కంపెనీలు బయటకు పంపాయి. దీనికి ప్రధాన కారణం ఆదాయం తగ్గడం, పెద్ద ఎత్తున ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించడమే. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న తొలగింపులను నిశితితంగా పరిశీలిస్తున్న Layoffs.fyi సంస్థ ప్రకారం.. ఈ ఏడాది జనవరి 6 నుంచి కంపెనీలు ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. ఇజ్రాయెల్ కంపెనీ సోలార్ ఎడ్జ్ 400 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది.
ఓలా ఎలక్ట్రికల్ భారత్‌లో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు మెటా కంపెనీ అత్యధికంగా 3,600 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కంపెనీలు దృష్టిపెడుతున్నాయి. మరో వైపు మెరుగైన పనితీరును కనబరచాలని కంపెనీలు ఉద్యోగులకు హుకూం జారీ చేస్తున్నాయి. ఎంప్లాయిస్‌కు పంపిన ఇంటర్నల్ నోట్లో మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పనితీరు నిర్వహణ స్థాయిని పెంచాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పనితీరు సరిగా లేని వారిని తొలగించి.. వారి స్థానంలో కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నారు.
ఇక ఖర్చుల తగ్గింపు ప్రణాళికలో భాగంగా తీసివేతలు జరుగుతున్నాయని హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజెస్ (HPE) తెలిపింది. దీంతో కంపెనీకి 350 మిలియన్ డాలర్లు ఆదా కానున్నది. ఈ ఏడాది మెటా 3,600 ఉద్యోగులను తొలగించింది. ఆ తర్వాత హెచ్‌పీఈ 2,500 మంది, హెచ్‌పీ 2వేల మంది, వర్క్‌డే 1,750 మంది, ఆటో డెస్క్ 1,350 మంది, ఓలా ఎలక్ట్రిక్ వెయ్యి మంది, బ్లూ ఆరిజిన్ వెయ్యి మంది, క్రూయిజ్ వెయ్యి మంది, సేల్స్‌ఫోర్స్ వెయ్యి మందిని తొలగించనున్నది.
మోర్గాన్ స్టాన్లీ ఈ నెలాఖరు నాటికి దాదాపు 2వేల ఉద్యోగులను తొలగించే అవకాశాలున్నాయి. కంపెనీ సీఈవో టెడ్ పిక్ నాయకత్వంలో తొలి రౌండ్ తొలగింపులు జరుగనున్నాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు కంపెనీలు ఏఐ, ఆటోమేషన్‌పై దృష్టిపెట్టింది. అమెజాన్ ఈ ఏడాది ప్రారంభంలో 14వేల మంది మేనేజర్లను తొలగించే ప్రణాళికను ప్రకటించింది. దాంతో కంపెనీకి ఏటా 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.6 బిలియన్లు ఆదా అయ్యే అవకాశాలున్నాయి. 2022 నుంచి 24 వరకు దాదాపు 5.82లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఓ నివేదిక పేర్కొంది.