పిల్లలకు ఏదైనా ఇచ్చినప్పుడు వారు ‘థ్యాంక్స్’ చెబుతుంటారు. చిన్నారుల నుంచి ‘థ్యాంక్స్’ అనే మాట విని.. పెద్దలు సంబురపడతారు. అయితే, ‘థ్యాంక్స్’ చెప్పడం కన్నా.. వారికి ‘కృతజ్ఞత’గా ఉండటం నేర్పించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ‘ధన్యవాదాలు’ చెప్పడం ఒక సామాజిక మర్యాద మాత్రమేననీ, అదే ‘కృతజ్ఞత’తో ఉండటం.. గొప్ప సంస్కారమనీ అంటున్నారు. మాటల కన్నా.. మనసుతో స్పందించే గుణాన్ని పిల్లలకు నేర్పించడం వారి భవిష్యత్తుకు ఎంతో అవసరమని పేర్కొంటున్నారు.
ఏదైనా సహాయం తీసుకున్నప్పుడు థ్యాంక్స్ అనే మాట చెప్పడం సాధారణ విషయమే! కానీ, కృతజ్ఞత అనేది ఆ సాయం వెనుక ఉన్న ప్రేమను, శ్రమను, ఉద్దేశాన్ని గుర్తించడం కూడా. థ్యాంక్స్ అనే మాట పెదాల నుంచి వస్తే.. కృతజ్ఞత అనేది హృదయం నుంచి వస్తుంది. పిల్లలకు ఇష్టమైన బొమ్మ కొని తెచ్చినప్పుడు దానిని కేవలం ఒక వస్తువులా చూపించొద్దు. దాని వెనక పెద్దవాళ్లు పడిన శ్రమను కూడా వారికి వివరించాలి. ‘అమ్మ నీకోసం ఎంతో వెతికి ఈ బొమ్మను తీసుకొచ్చింది’ అని చెప్పాలి.
‘నీకు నచ్చిన ప్లేస్‌కి తీసుకెళ్లడానికి నాన్న ఎంతో కష్టపడ్డారు’ అంటూ వివరించాలి. దీనివల్ల పిల్లలు ఆ వస్తువు, ప్రయాణంపై ఇష్టం కన్నా.. దానివెనక ఉన్న వ్యక్తి పట్ల మరింత గౌరవం పెంచుకుంటారు. ఈ అలవాటును ఇంటికే కాదు.. రోజువారీ జీవితంలో పిల్లలకు సహాయం చేసే అందరికీ వర్తింపజేయాలి. ఇంట్లో పనివాళ్లు, స్కూల్ బస్ డ్రైవర్, స్కూల్లో వాచ్‌మన్.. వీళ్లు లేకపోతే, ఎంత ఇబ్బందిగా ఉంటుందో పిల్లలకు వివరించాలి. వారి సేవలను గుర్తించడం, వారితో గౌరవంగా ప్రవర్తించడం నేర్పించాలి.
ఈ అలవాటు పిల్లల్లో అహంకారాన్ని తగ్గించి, వినయాన్ని పెంచుతుంది. మరో ముఖ్యమైన విషయం, పెద్దలు చెప్పే మాటలకన్నా.. వారు చేసే పనులనే పిల్లలు ఎక్కువగా గమనిస్తారు. కాబట్టి, ఇంట్లో పెద్దవాళ్లు కూడా వారి తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, తోటివారితో కృతజ్ఞతగా ప్రవర్తించాలి. దీనివల్ల పిల్లలు సహజంగానే దానిని అనుకరిస్తారు. ఇంట్లో ఒకరికొకరు చిన్నచిన్న పనులకు కృతజ్ఞతలు చెప్పుకోవడం ఒక సంప్రదాయంగా మార్చుకోవాలి. ఇలా పిల్లలకు చిన్నతనం నుంచే కృతజ్ఞతగా ఉండటం అలవరిస్తే.. సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదుగుతారు.