న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) ఉద్యోగులకు, నిరుద్యోగులకు మరొక షాక్ ఇచ్చింది. సీనియర్ స్థాయిలో ఉద్యోగుల నియామకాలను నిలిపేయాలని నిర్ణయించింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా తమ సిబ్బందికి వార్షిక వేతన పెంపును ఆపేయాలని తీర్మానించింది. అనుభవం కలిగిన కొత్త ఉద్యోగుల చేరిక సమయాన్ని 65 రోజులకు మించి పొడిగించింది. హైదరాబాద్, పుణె, చెన్నై, కోల్‌కతాలోని కార్యాలయాల్లో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. ప్రాజెక్టులు లేని ఉద్యోగులు 35 రోజుల్లోగా వాటిని పొందాలని.. లేదంటే ఉద్యోగం వదిలి వెళ్లాలని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాజకీయ టెన్షన్ల వల్ల, స్థూల ఆర్థిక అనిశ్చితి వల్ల, కంపెనీ దీర్ఘకాలిక స్థిరత్వం, మనుగడను దృష్టిలో ఉంచుకొని వార్షిక వేతన పెంపుదలకు విరామం ఇస్తున్నట్టు గత శనివారం ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో కంపెనీ తెలిపింది. ఆపరేషన్స్‌లో భారీగా ఖర్చులను తగ్గిస్తున్నారని ఓ టీసీఎస్ మధ్య స్థాయి ఉద్యోగి ఫైనాన్షియల్ డైలీకి తెలిపారు.