ఎదులాపురం, మార్చి 24 : ‘టీబీ పోవాలి.. దేశం గెలువాలి’అంటూ ఆదిలాబాద్ డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ నినదించారు. ప్రపంచ టీబీ నివారణ దినం సందర్భంగా గురువారం జిల్లా టీబీ నియంత్రణ కేంద్రం నుంచి ఆశ కార్యకర్తలతో కలిసి ర్యాలీ తీశారు. దీనిని డీఎంహెచ్‌వో జెండా ఊపి ప్రారంభించారు. టీబీ వస్తే భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా వైద్యం అందుతుందని తెలిపారు. వైద్యులు సూచించిన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడితే త్వరలోనే టీబీ నయమవుతుందని తెలిపారు. రెండు వారాలకు పైగా తెమడతో కూడిన దగ్గు, సాయంత్రం పూట జ్వరం పెరగడం, రాత్రి సమయంలో చెమటతో కూడిన జ్వరం, ఛాతిలో నొప్పి, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, నీరసంగా ఉండడం వంటి లక్షణాలున్నట్లు అనిపిస్తే వెంటనే టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 807 మంది టీబీ వ్యాధిగ్రస్తులున్నారని, వారికి ప్రతినెలా మందులతో పాటు రూ.500 వారి అకౌంట్లలో వేస్తామన్నారు. గిరిజన ప్రాంతంలోని టీబీ వ్యాధిగ్రాస్తులకు ఒకే సారి రూ.750 అందజేస్తామని పేర్కొన్నారు. జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ ఈశ్వర్‌రాజ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, జిల్లా టీబీ కో ఆర్డినేటర్ చెన్నమల్లయ్య, ల్యాబ్ టెక్నీషియన్ బండారి కృష్ణ, సిబ్బంది నవీద్, ఎస్టీఎస్ రమేశ్, నాగభూషణం, మాస్ మీడియా అధికారి వెంకట్ రెడ్డి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
నిర్మల్ చైన్‌గేట్, మార్చి 24: నిర్మల్ జిల్లాను క్షయ రహితంగా మార్చాలని డీఎంహెచ్‌వో ధన్‌రాజ్ అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినం సందర్భంగా డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురువారం కార్యక్రమం నిర్వహించారు. క్షయ వ్యాధిని త్వరగా గుర్తిస్తే చికిత్స అందించే ఆస్కారం ఉందన్నారు. వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందకుండా చూడవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో గత సంవత్సరం 1,131 కేసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం జనవరి వరకు 331 కేసులు మాత్రమే గుర్తించామని చెప్పారు. సిబ్బంది సైతం క్షయ వ్యాధిగ్రస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చి చికిత్స చేయాలన్నారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 13 వరకు 21 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ శ్యాం కుమార్, డిప్యూటీ జిల్లా వైద్యాధికారి ఆశిష్‌రెడ్డి, డిప్యూటీ జిల్లా విస్తరణ, మాస్‌మీడియా అధికారి రవీందర్, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఎదులాపురం, మార్చి 24 : ఆదిలాబాద్‌ను టీబీ రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ టీబీ నివారణ దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ముందుగా జిల్లాలో పీహెచ్‌సీల వారీగా నమోదవుతున్న టీబీ వ్యాధిగ్రస్తుల వివరాలు, అందిస్తున్న చికిత్సలు, వ్యాధి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను వైద్యాధికారులు వివరించారు. జిల్లాలో టీబీ వ్యాధిని సమూలంగా అంతం చేయడానికి అధికారులు, వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, లక్షణాలున్న వారికి చికిత్స అందించాలన్నారు. ప్రణాళికాబద్ధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో 2022 సంవత్సరానికి గాను రాష్ట్రంలోనే మన జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 807 మంది వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారన్నారు. అనంతరం చికిత్స పూర్తయిన వారికి, వ్యాధి నిర్మూలనకు విశేషంగా కృషి చేసిన వైద్యులు, ఆశ కార్యకర్తలను శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, అదనపు డీఎంహెచ్‌వో సాధన, జిల్లా టీబీ నియంత్రణ అధికారి ఈశ్వర్ రాజ్, జిల్లా టీబీ కో ఆర్డినేటర్ చెన్నమల్లయ్య, ల్యాబ్ టెక్నీషియన్ బండారి కృష్ణ, సిబ్బంది నవీద్, ఎస్టీఎస్ రమేశ్, నాగభూషణం, మాస్ మీడియా అధికారి వెంకట్ రెడ్డి, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.