హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వివిధ రకాల పన్నుల ద్వారా రాబడి భారీగా పెరిగింది. ఫిబ్రవరి నాటికి రూ.98,199 కోట్లు వసూలైంది. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా ప్రభావంతో పన్ను రాబడి రూ.67,963 కోట్లు మాత్రమే రాగా, ఈ ఏడాది ఏకంగా 30,236 కోట్లు పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగింపుతో ఆర్థికశాఖ పన్ను రాబడి గణాంకాలను విడుదలచేసింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సగటున నెలకు రూ.2,500 కోట్ల చొప్పున పన్ను రాబడి పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మార్చిలో వసూలైన రూ.11,376 కోట్లు ఏడాది మొత్తంలో అత్యధికం కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో గత ఫిబ్రవరిలో రూ.12,820 కోట్లు వసూలు కావటం గమనార్హం. 2021-22లో మార్చి నెలకు సంబంధించి పన్నుల రాబడి వివరాలు ఇంకా రావాల్సి ఉన్నది.