పల్లెటూరి నేపథ్యంలో మర్డర్ మిస్టరీ కథాంశంతో ‘తత్వం’ చిత్రాన్ని తెరకెక్కించామని చెప్పారు చిత్ర దర్శకుడు అర్జున్ కోలా. దినేష్తేజ్, దష్విక కె జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం దర్శకుడు అర్జున్ కోలా విలేకరులతో ముచ్చటించారు. మర్డర్ మిస్టరీతో పాటు పాత్రల తాలూకు సైకాలజీని ఈ సినిమాలో చూపెట్టామని, అందుకే ‘తత్వం’ అనే టైటిల్ను ఖరారు చేశామని అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘ఓ మర్డర్ మిస్టరీ వెనక నిజాలు, అబద్దాలు అన్నీ ఉంటాయి.
వాటిని తెలుసుకునే క్రమంలో మనిషి తత్వం బయటపడుతుంది. కథానుగుణంగా మంచి టైటిల్ కుదిరింది’ అన్నారు. ఈ సినిమా విషయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నామని, హీరోహీరోయిన్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో షూటింగ్ ఆలస్యమైందని అర్జున్ కోలా తెలిపారు. తదుపరి చిత్రంగా గోదావరి నేపథ్యంలో ‘ద్వారపూడి డేస్’ తీయబోతున్నానని ఆయన పేర్కొన్నారు.