హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రజలకు నిరంతరం ఉపాధి కల్పించడంతోపాటు పనుల్లో వేగం పెంచాలని, నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక సూచించారు. వీబీ-జీ రామ్జీ పనులను కేవలం ఉపాధి కల్పించే కార్యక్రమంగా కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రక్షణ కల్పించేలా అమలు చేయాలని సర్పంచులు, అధికారులను ఆదేశించారు. వీబీ-జీ రామ్జీ పథకం అమలుపై బుధవారం సచివాలయం నుంచి మంత్రి సీతక వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి 12 వేలకుపైగా సర్పంచులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సర్పంచులు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ప్రజల అవసరాలను గుర్తించి పనులను వేగవంతం చేయాలని సూచించారు.