Pollution Certificate to EV : రాజస్థాన్ (Rajastan) లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. కాలుష్యానికి ఏమాత్రం కారణంకాని ఎలక్ట్రిక్ వాహనానికి (EV) పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ లేదంటూ ఓ పోలీసు అధికారి చలాన్ విధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ కావడంతో పోలీసుశాఖపై విమర్శలు వెల్లువెత్తాయి.
వివరాల్లోకి వెళ్తే.. నాగౌర్ జిల్లాలో ఓ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును ఆపారు. కారు అద్దాలకు సన్‌షేడ్స్ ఉన్నాయని మొదట రూ.200 జరిమానా విధించారు. ఆ తర్వాత పీయూసీ సర్టిఫికెట్ చూపించమని అడగ్గా.. ఎలక్ట్రిక్ వాహనానికి అది అవసరం లేదని కారు యజమాని వాదించారు. అయినప్పటికీ అధికారి వినిపించుకోకుండా పీయూసీ లేనందుకు మరో రూ.1,500 చలాన్ విధించారు.
ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. కారు యజమానితో వాగ్వాదం జరిగిన గందరగోళంలో పొరపాటున పీయూసీ చలాన్ జారీ చేశామని అంగీకరించారు. ఈ విషయంపై విచారణ జరుపుతున్నామని, పొరపాటున వేసిన ఫైన్‌ను సిస్టం నుంచి రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా కేంద్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ నుంచి పూర్తి మినహాయింపు ఉంది.