ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ఇటీవల జరిగిన ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడింగ్‌లో పెద్ద సంఖ్యలో నకిలీ బంగాళాదుంపలు బయటపడ్డాయి. వాడిపోయిన బంగాళాదుంపలు తాజాగా కనిపించడం కోసం వ్యాపారులు వాటికి కెమికల్స్ పూస్తున్నారు. లాభాల కోసం కక్కుర్తితో వినియోగదారుల ఆరోగ్యాలను ఫణంగా పెడుతున్నారు. కాబట్టి కస్టమర్లు ఆలుగడ్డలు కొనేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవి నకిలీవో, ఏవీ అసలువో పరిశీలించి కొనుగోలు చేయాలి. అదృష్టవశాత్తు నకిలీ ఆలుగడ్డలను గుర్తించడానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి.
వాసన : నిజమైన ఆలుగడ్డలు సహజమైన మట్టి వాసన కలిగి ఉంటాయి. నకిలీ ఆలుగడ్డలు అందుకు విరుద్ధంగా కృత్రిమమైన రసాయనాల వాసన కలిగి ఉంటాయి.
రంగు : ఆలుగడ్డను కత్తిరించి చూడాలి. నకిలీ ఆలుగడ్డ అయితే లోపల, బయట వేర్వేరు రంగులో కనిపిస్తుంది. స్వచ్ఛమైన ఆలుగడ్డ రంగు లోపల, బయట ఒకేలా ఉంటుంది.
నీటి పరీక్ష : ఆలుగడ్డలను నీటిలో వేయడం ద్వారా కూడా ఏది నకిలీనో, ఏది స్వచ్ఛమైనదో గుర్తించవచ్చు. నకిలీ ఆలుగడ్డలు రసాయనాల కారణంగా నీళ్లలో తేలుతూ ఉంటాయి. కానీ స్వచ్ఛమైన, తాజా ఆలుగడ్డలు నీళ్లలో మునిగిపోతాయి.
మట్టి : నకిలీ బంగాళాదుంపలపై ఉన్న పూత మట్టి నీళ్లలో వేయగానే సులువుగా కరిగిపోతోంది. కానీ స్వచ్ఛమైన ఆలుగడ్డలపై ఉండే సహజమైన మట్టి అంత సులువుగా పోదు. అదిపోవాలంటే గట్టిగా రుద్ది కడగాల్సి వస్తుంది.
తొక్క : ఆలుగడ్డలను కడిగేటప్పుడు స్వచ్ఛమైన ఆలుగడ్డలపై ఉండే పొట్టు సులువుగా ఊడిపోతుంది. కానీ నకిలీ ఆలుగడ్డలపై ఉండే పొట్టు వాడిపోవడంవల్ల అంత సులువుగా ఊడదు.
గమనిక : పైన పేర్కొన్న మెలుకువలను పాటించడం ద్వారా మనం మార్కెట్లో దొరికే ఆలుగడ్డల్లో నకిలీవి ఏవో, స్వచ్ఛమైనవి ఏవో గుర్తించవచ్చు.
నకిలీ ఆలుగడ్డలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. రసాయనాలు, కృత్రిమ రంగులు కలిపిన ఆ ఆలుగడ్డలు తినడంవల్ల కాలేయం, మూత్రపిండాలు లాంటి సున్నితమైన అవయవాలు దెబ్బతింటాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఆకలిని కోల్పోవడం లాంటి జీర్ణ సంబంధ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి అలుగడ్డలే కాదు, ఏ ఆహార ఉత్పత్తులనైనా గుడ్డిగా కాకుండా, కొంచెం పరిశీలించి కొనుగోలు చేయడం ఉత్తమం.