ఖమ్మం, జనవరి 27: బీఆర్ఎస్ నాయకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో నాలుగు పథకాల అమలుకు ఆదివారం ఏర్పాటు చేసిన గ్రామసభలో బీఆర్ఎస్ నాయకుడు కొడెం రవిపై కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేయగా తలకు బలమైన గాయమై ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సోమవారం తాతా మధు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావుతో కలిసి రవిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవికి న్యాయం జరిగే వరకూ పార్టీ తరఫున పోరాడుతామని అన్నారు. గ్రామసభలో ఇటువంటి దాడి జరగడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ గూండాల దుశ్చర్యను పార్టీ ఖండిస్తున్నదన్నారు. దాడికి పాల్పడిన ప్రతిఒక్కరికి శిక్షపడేలా చూస్తామని, రవికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఖమ్మంరూరల్ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, నాయకులు మేడ మోహన్రావు, అశ్వారావుపేట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.