హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అప్పులపై చర్చకు రమ్మని సవాల్ విసిరి, తీరా వస్తే అరెస్టులు చేస్తారా అంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చర్చకు వెళ్తూ గురువారం అరస్టై కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు, మిగిలిన నేతలను ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాష్ట్రంలో నడుస్తున్నది సర్కార్ కాదని.. సర్కస్ అని ఎద్దేవా చేశారు. రెండున్నరేండ్లలో రూ.4 లక్షల కోట్లు అప్పు చేసి ఒక్క మంచి పనీ చేయలేదని విమర్శించారు. బూతులు మాట్లాడుతున్న అధికార పార్టీ నేతలపై కేసులు లేవని, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలపై మాత్రం కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
ఇదే ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉండదనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మంత్రుల సవాల్ స్వీకరించి గన్‌పార్క్ కు బయల్దేరిన హరీశ్‌రావుతో పాటు ఇతర నేతలను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణిని అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేశారని విమర్శించారు.