Ivy Gourd | ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన వారు తినే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. భారత్‌తోపాటు ఆసియా దేశాలకు చెందిన వారు దొండకాయలను ఎక్కువగా తింటుంటారు. వీటినే కుంద్రు, తిండోరా అని కూడా పిలుస్తారు. దొండకాయలు మనకు పలు రకాల వెరైటీల్లో లభిస్తుంటాయి. వీటితో వేపుడు, పచ్చడి వంటివి చేసుకుంటారు. టమాటాలతో కలిపి వండినా ఎంతో రుచిగా ఉంటాయి. దొండకాయల్లో క్యాలరీలు చాలా స్వల్పంగా ఉంటాయి. వీటిల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకు పోషణను, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ క్రమంలోనే దొండకాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల అనేక లాభాలను పొందవచ్చని అంటున్నారు.
దొండకాయలను తినడం వల్ల షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. దొండకాయ జ్యూస్‌ను రోజూ ఉదయం పరగడుపునే తాగుతుండాలి. దీని వల్ల శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో గ్లూకోజ్ మెటబాలిజం మెరుగు పడుతుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ఉపశమనం లభిస్తుంది. దొండకాయల్లో ఫైబర్ అధికంగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటి జ్యూస్‌ను రోజూ తాగుతుంటే ఫైబర్ కారణంగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. దొండకాయలను తినడం వల్ల శరీరం మెటబాలిజం మెరుగు పడుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
దొండకాయల్లో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. ఇవి ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తాయి. అందువల్ల వీటిని తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. దొండకాయల్లో విటమిన్లు సి, ఎ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. కంటి చూపు మెరుగు పడేలా చేస్తాయి. ఈ కాయల్లో ఉండే బయో యాక్టివ్ సమ్మేళనాల వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, సాపోనిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయి. రక్త నాళాల వాపులు, కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. దీని వల్ల ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది.
దొండకాయలను తింటే పొటాషియం అధికంగా లభిస్తుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. దీని వల్ల హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దొండకాయల జ్యూస్‌ను రోజూ తాగితే ఐరన్ అధికంగా లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. నీరసం, అలసట తగ్గిపోతాయి. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యానికి కూడా ఇవి పనిచేస్తాయి. శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతాయి. ఇలా దొండకాయలను రోజూ తింటున్నా లేదా వాటి జ్యూస్‌ను సేవిస్తున్నా కూడా మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.