Potassium | మన శరీరానికి అనేక పోషకాలు అవసరం అవుతాయన్న విషయం తెలిసిందే. పోషకాలను పొందాలంటే మనం పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాల్లో విటమిన్లు, మినరల్స్ కూడా ఒకటి. చాలా మంది విటమిన్లు ఉండే ఆహారాలను తింటారు. కానీ మినరల్స్ కూడా ముఖ్యమే. ఇవి మన శరీరంలో అనేక జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడేందుకు దోహదం చేస్తాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక అలాంటి మినరల్స్‌లో పొటాషియం కూడా ఒకటి. ఇది మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడి బీపీ నియంత్రణలో ఉండేందుకు సహాయం చేస్తుంది. హార్ట్ స్ట్రోక్స్ రాకుండా రక్షిస్తుంది. కండరాల నొప్సులు, కండరాలు పట్టుకుపోవడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక పొటాషియం ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
పొటాషియం వల్ల మన శరీరంలోని కణాలు ఉత్తేజం చెందుతాయి. యాక్టివ్‌గా మారుతాయి. దీంతో ఉత్సాహంగా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు. నీరసం, అలసట తగ్గుతాయి. బద్దకం పోతుంది. కండరాల పనితీరు మెరుగు పడుతుంది. నాడీ మండల వ్యవస్థ చురుగ్గా ఉంటుంది. గుండె అసాధారణ రీతిలో కొట్టుకోకుండా లయబద్దంగా కొట్టుకుంటుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. ఇలా అనేక రకాల పనులకు పొటాషియం అవసరం అవుతుంది. అయితే మన శరీరంలో పొటాషియం తక్కువగా ఉన్నా, లోపించినా పలు లక్షణాలు కనిపిస్తాయి. కండరాలు బలహీనంగా మారి తరచూ నొప్పులకు గురవుతుంటాయి. రాత్రి పూట నిద్రలో తరచూ కాలి పిక్కలు పట్టుకుపోతాయి. తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. బీపీ పెరుగుతుంది. ఆకలి ఉండదు. మానసికంగా కుంగిపోయినట్లు అవుతారు. వికారంగా ఉండడం, వాంతికి వచ్చినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి మల విసర్జన చేసేటప్పుడు రక్తం కూడా వస్తుంది.
పొటాషియం సూక్ష్మ పోషకాల జాబితాకు చెందుతుంది. కనుక ఇది రోజూ మనకు చాలా స్వల్ప మొత్తంలో అవసరం అవుతుంది. సాధారణంగా మనకు రోజుకు అవసరం అయ్యే పొటాషియం స్త్రీలు, పురుషులకు వేర్వేరుగా ఉంటుంది. పురుషులకు అయితే రోజుకు 3400 మిల్లీగ్రాముల మేర పొటాషియం కావాలి. అదే స్త్రీలకు అయితే 2600 మిల్లీగ్రాముల పొటాషియం అవసరం అవుతుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు రోజుకు 2900 మిల్లీగ్రాముల మేర పొటాషియం కావాల్సి ఉంటుంది. పొటాషియంను మన శరీరం నిల్వ చేసుకోదు. కనుక రక్తంలో అధికంగా పొటాషియం ఉన్నప్పటికీ శరీరం దీన్ని మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. అయితే తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఉన్నవారు పొటాషియం ఉండే ఆహారాలను మరీ అతిగా తీసుకోకూడదు. డాక్టర్ సూచన మేరకు తీసుకోవాల్సి ఉంటుంది.
పొటాషియం మనకు అనేక ఆహారాల ద్వారా లభిస్తుంది. ఆలుగడ్డలు, చిలగడ దుంపలు, పాలకూర, బీట్ రూట్ ఆకులు, అరటి పండ్లు, అవకాడో, నారింజ, తర్బూజా, కివి, గ్రేప్ ఫ్రూట్, సోయా బీన్, బొబ్బర్లు, మినుములు, బ్లాక్ బీన్స్, రాజ్మా, పప్పు దినుసులు, యాప్రికాట్స్, కిస్మిస్లు, ఖర్జూరాలు, పెరుగు, టమాటా, చేపలు, గుమ్మడి విత్తనాలు, బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్, పిస్తా పప్పు, పొద్దు తిరుగుడు విత్తనాలు, అవిసె గింజలు, చియా సీడ్స్ వంటి అనేక ఆహారాల్లో పొటాషియం మనకు లభిస్తుంది. అయితే ఇవన్నీ ఎందుకనుకుంటే సింపుల్‌గా రోజుకు ఒక అరటి పండు లేదా ఒక నారింజ పండును తినవచ్చు. వీటిల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇలా ఆయా ఆహారాలను రోజూ తీసుకుంటే శరీరానికి పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. దీని వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.