PCOS | ప్రస్తుతం చాలా మంది మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతోంది. హార్మోన్ల సమస్యలను చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్నారు. దీని వల్ల నెలసరి సరిగ్గా రాకపోవడం, థైరాయిడ్, సంతాన లోపం వంటి సమస్యలు వస్తున్నాయి. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడితే అది దీర్ఘకాలంలో పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీవోఎస్) అనే సమస్యకు దారి తీస్తుంది. దీన్నే పీసీవోడీ అని కూడా వ్యవహరిస్తారు. ఈ వ్యాధి వచ్చిన మహిళలో రుతు క్రమం సరిగ్గా ఉండదు. రుతుక్రమం అయినప్పుడు అధిక రక్తస్రావం అవుతుంది. శరీరంపై అవాంఛిత రోమాలు వస్తాయి. మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. నెలసరి సరిగ్గా ఉండని కారణంగా సంతానం కలగడం ఆలస్యం అవుతుంది. లేదా సంతాన లోపం ఏర్పడుతుంది. అయితే పీసీవోఎస్ సమస్య ఉన్న మహిళలు డాక్టర్లచే చికిత్స తీసుకోవాలి. క్రమం తప్పకుండా మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది.
పీసీవోఎస్ ఉన్న మహిళలు పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, రొయ్యలు, కోడిగుడ్లు వంటి ఆహారాలను మానేయాలి. వెజిటేరియన్ ఆహారాలనే అధికంగా తీసుకోవాలి. ఈ సమస్య మహిళలు రోజూ క్యారెట్, బీట్ రూట్, పాలకూరను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఈ మూడింటినీ కలిపి జ్యూస్‌లా చేసి రోజూ ఒక కప్పు మోతాదులో తాగవచ్చు. ఉదయం లేదా రాత్రి ఏ సమయంలో తాగినా సరే ఉపయోగం ఉంటుంది. ఈ జ్యూస్ వల్ల హార్మోన్ల సమస్యలు తొలగిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. గర్భాశయానికి జరిగే నష్టం నివారించబడుతుంది. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. మెంతులు, వాము, పప్పు దినుసులు, సూప్‌లను ఎక్కువగా తీసుకోవాలి. మెంతులను రోజూ నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు. వాము నీళ్లను తాగవచ్చు. కందిపప్పు, పెసలు వంటి వాటిని తరచూ తినాలి. ఈ విధంగా చేస్తుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది.
పీసీవోఎస్ ఉన్నవారు చియా విత్తనాలను రోజూ గుప్పెడు మోతాదులో నీటిలో నానబెట్టి తింటుండాలి. లేదా అవిసె గింజలను గుప్పెడు తీసుకుని పెనంపై వేయించి తినవచ్చు. గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, నువ్వులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని నీటిలో నానబెట్టి లేదా పెనంపై వేయించి తినవచ్చు. ఈ విత్తనాల్లో ఉండే ప్రోటీన్లు మహిళలకు ఎంతో మేలు చేస్తాయి. హార్మోన్ల సమస్యలను తగ్గిస్తాయి. అలాగే శక్తి లభించేలా చేస్తాయి. అదేవిధంగా జీలకర్ర నీళ్లను రోజూ తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. సోంపు గింజలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవచ్చు. దీని వల్ల హార్మోన్ల సమస్యలు తగ్గడమే కాదు, మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. ధనియాల నీళ్లను రోజూ తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. యాలకుల పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. హార్మోన్ల సమస్యలను తగ్గించడంలో ఇవి కూడా అద్భుతంగా పనిచేస్తాయి.
మహిళలు రోజూ దానిమ్మ పండ్లు, నల్ల ద్రాక్షలను తినడం వల్ల మేలు జరుగుతుంది. వీటి వల్ల రక్త శుద్ధి అవుతుంది. గర్భాశయానికి పోషకాలు సరిగ్గా లభిస్తాయి. దెబ్బ తిన్న కణజాలం మరమ్మత్తులకు గురవుతుంది. దీని వల్ల కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. పీసీవోఎస్ నుంచి త్వరగా బయట పడవచ్చు. ఈ సమస్య ఉన్న మహిళలు ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉన్నా కూడా హార్మోన్ల సమస్యలు వస్తాయి. వాటిని తగ్గించేందుకు గాను యోగా, ధ్యానం వంటివి చేయాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ చేస్తున్నా ఉపయోగం ఉంటుంది. శ్వాస వ్యాయామాలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఉష్ట్రాసనం, నౌకాసనం, బద్ద కోణాసనం వంటి ఆసనాలను వేస్తున్నా కూడా మహిళలు హార్మోన్ల సమస్యలను తగ్గించుకోవచ్చు. పీసీవోఎస్ నుంచి బయట పడతారు. ఆరోగ్యంగా ఉంటారు.