Skill Development | రామగిరి మే 31: సింగరేణి సంస్థ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు అన్నారు. శనివారం స్థానిక వీటీసీ లోని స్కిల్ డెలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో సింగరేణి సంస్థ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో 30 మంది అభ్యర్థులకు రెండు వారాల పాటు నిర్వహించిన ఉచిత కంప్యూటర్, డిటిపి నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని, శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్ లను అందశేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉద్యోగుల కుటుంబ సభ్యుల కోసమే కాకుండా, పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువత కోసం కూడా ఎన్నో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని, నైపుణ్యాన్ని సంపాదించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవాలని, సమీప గ్రామాల అభివృద్ధి కోసం ఉపాధి అవకాశాలు పెంచడానికి సింగరేణి సంస్థ సిఎస్ఆర్ లో బాగంగా ఈ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు, ఈ స్కిల్ డెలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో సుమారు 38 కోర్సు లలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీటిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని, స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా బలోపేతం కావలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎంలు యం.రామ్మోహన్, బి.వి.సత్య నారాయణ, మేనేజర్ సుజీత్, డివై ఎస్ఇ శ్రీనివాస్, శిక్షకులు బెంజిమెన్ పాల్గొన్నారు.