T Works | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): సృజనాత్మక ఆలోచనలకు భౌతిక రూపమే టీ వర్క్. ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ ప్రస్తుతం ఆవిష్కర్తలకు దూరంగా నిలుస్తున్నది. రాయిదుర్గం నాలెడ్జ్ సిటీలో విశాలమైన ప్రాంగణంలో మొదటి దశలో 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గత ప్రభుత్వం టీ వర్క్స్‌ను నిర్మించింది. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఈ ఆవిష్కరణల సెంటర్ ప్రస్తుతం వెలవెలపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మారగానే అంతా తారుమారైంది. ఆవిష్కరణలు చేసుకోవాలంటే ఒక్కొక్కరు ఏడాదికి రూ.35 వేలు చెల్లిస్తేనే స్టార్టప్ కార్యకలాపాలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని టీ వర్క్స్ నిర్వాహకులు ఖరాఖండిగా చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించకపోవడంతో సొంతంగా ఆదాయ వనరుల మార్గాలను అన్వేషించుకోవాలని ప్రభుత్వ పెద్దలే చెప్పడంతో టీ వర్క్స్ పరిస్థితి మొత్తం మారిపోయింది. గతంలో ఇక్కడ పనిచేసిన వారంతా ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు.
ఆరు నెలల్లో అంతా తారుమారు..
సరికొత్త ఆవిష్కరణలతో ఎన్నో సమస్యలకు చక్కని పరిష్కారం చూపే ఔత్సాహికులు తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది ఉన్నారు. అలాంటి వారికి టీ వర్క్స్‌లో ప్రోత్సాహం కరువుకావడంతో వారి ఆందోళన చెందుతున్నారు. ఆరు నెలల్లోనే ఈ పరిస్థితి దాపురించిందని విమర్శిస్తున్నారు. టీ హబ్‌తో టెక్నాలజీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నట్లుగానే హార్డ్‌వేర్ రంగంలోనూ, ముఖ్యంగా సరికొత్త డిజైన్లతో భౌతిక ఉత్పత్తులను తయారు చేసే వారిని గుర్తించడంతో పాటు వారిని ప్రోత్సహించేందుకు టీ-వర్క్స్‌ను గత కేసీఆర్ ప్రభుత్వం వందలాది కోట్లను వెచ్చించి ఏర్పాటు చేసింది. ఇంత చేసి నా కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఔత్సాహికులైన ఆవిష్కర్తలకు మాత్రం ఇక్కడ అడుగు పెట్టాలంటే డబ్బులు కట్టాల్సిందే అంటున్నాయి. దీనిపై ఆవిష్కరణలు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.