ఆనియన్ సమోసా, ఆలూ సమోసా, కార్న్ సమోసా, పనీర్ సమోసా.. కాంబినేషన్ ఏదైనా సమోసా అంటే చాలు, నోరూరాల్సిందే. అయితే తియ్యతియ్యని చాక్లెట్ సమోసా ఎప్పుడైనా రుచి చూశారా? అదికూడా పావ్ భాజీ కాంబినేషన్లో. వినడానికే కొత్తగా ఉంది కదూ! కానీ ఈ వంటకమే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వీధి వ్యాపారి బ్రెడ్‌పై చాక్లెట్ క్రీమ్ వేసి మధ్యలో చిన్న సమోసా పెట్టి, పైన ఇంకొంత క్రీమ్ వేసి సర్వ్ చేస్తున్నాడు. అంతేకాదు చాక్లెట్ కూరిన సమోసాలనూ వేడివేడిగా అందిస్తున్నాడు. అతని వ్యాపారం బాగానే జరుగుతున్నా నెటిజన్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
నలభై ఆరేండ్లు వచ్చినా నవయవ్వనంతో మెరిసిపోతూ కొత్తతరం నటులకు పోటీనిస్తున్నాడు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు మహేశ్ చాలానే కష్టపడతాడు. దాదాపు పదేండ్లుగా పాలు, పాలతో చేసిన పదార్థాలు, పిజ్జా, బర్గర్, బ్రెడ్ వంటి గ్లూటెన్ ఉండే పదార్థాలతోపాటు జంక్ ఫుడ్ కూడా తీసుకోవడం మానేశాడు. తప్పనిసరి అయితే స్వీట్లు.. అదీ తక్కువ మోతాదులో తింటాడు. ‘కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే. మొదట్లో కాస్త కష్టం అనిపించినా మెల్లగా అదే అలవాటైపోతుంది. చాలావరకు అన్నీ తింటాను. కానీ ఏది ఎంత తినాలో అంతే తింటా. ఎంత బిజీగా ఉన్నా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తా’ అంటూ ఓ కార్యక్రమంలో తన ఫిట్నెస్ రహస్యాన్ని పంచుకున్నాడు మహేశ్.
రోజువారీగా వండుకునే కూరగాయల్లో దొండకాయ ఒకటి. చూడటానికి చిన్నగా, పొట్టిగా కనపడినా తక్కువ అంచనా వేయలేం. దొండలోనూ అనేక పోషకాలున్నాయి. దొండ కాయల్ని తింటే బుద్ధి మందగిస్తుందనేది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.
1. దొండకాయలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలం. పీచు, ప్రొటీన్లు లభిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు హానికర బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి.
2. దొండలోని యాంటీ -హిస్టమైన్ గుణాల వల్ల అలర్జీ రాదు. దగ్గు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారికి పరమౌషధం. వీటిలోని విటమిన్-బి నాడీ వ్యవస్థను రక్షిస్తుంది.
మానసిక ఆందోళన, మూర్ఛ వ్యాధితో బాధపడేవారికి దొండ చక్కటి పరిష్కారం.
3. దొండకాయలోని క్యాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది. మధుమేహవ్యాధిగ్రస్తులు కూడా నిక్షేపంగా తినవచ్చు.
4. థయమిన్ దొండలో పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వు, ప్రొటీన్ల జీవక్రియకు ఉపయోగపడుతుంది. బి-కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణవ్యవస్థకూ మేలుచేస్తాయి.
5. ఇందులోని విటమిన్-సి, బీటా కెరోటిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.
6. రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉండే దొండకాయ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.
హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్! మరో మాట లేదు. ప్రపంచమంతటా మన బిర్యానీకి అభిమానులున్నారు. అయితే హైదరాబాదీ బిర్యానీతోపాటు మరిన్ని రుచులను కిలోల లెక్కన అందిస్తూ భోజనప్రియులను ఆకర్షిస్తున్నది ‘బిర్యానీ బై కిలో’ రెస్టారెంట్. 2015లో ప్రారంభమైన ఈ రెస్టారెంట్ ఎనభైకి పైగా ఔట్లెట్లతో దేశవ్యాప్తంగా ముప్పై నగరాల్లో విస్తరించింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, కూకట్‌పల్లిలో శాఖలు ఉన్నాయి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలతో సంబంధం లేకుండా స్వయంగా రెస్టారెంట్ సిబ్బందే.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య ఆర్డర్ చేసిన పదార్థాలను డోర్ డెలివరీ చేస్తారు. కిలో బిర్యానీ రూ. 750. ఈ రెస్టారెంట్లో హైదరాబాదీ బిర్యానీతోపాటు కలకత్తా బిర్యానీ, లక్నో బిర్యానీ, గుంటూరు బిర్యానీలనూ వడ్డిస్తున్నారు. ఫిష్-65, చెట్టినాడ్ చికెన్ రోస్ట్, ప్రాన్స్-65 బిర్యానీ, ఆంధ్రా ైస్టెల్ మష్రూమ్ కర్రీ వంటి నాన్‌వెజ్ వెరైటీలతోపాటు వెజ్ ప్రియులకోసం కతల్ బిర్యానీ, పనీర్ బిర్యానీ, బురానీ రైతా వంటి రుచులనూ అందిస్తున్నారు. కబాబ్స్ వీరి ప్రత్యేకత. నాణ్యమైన బాస్మతి బియ్యం, కేరళ నుంచి దిగుమతి చేసుకున్న మసాలాలు, తాజా మాంసం, కూరగాయలతో వండటమే తమ విజయ రహస్యమని చెబుతున్నారు బిర్యానీ బై కిలో రెస్టారెంట్ వ్యవస్థాపకులు కౌశిక్ రాయ్, విశాల్ జిందాల్, రితేశ్ సిన్హా.
టీనేజ్ అమ్మాయిల నుంచి మెనోపాజ్ దశలో ఉన్నవారి వరకూ చాలామంది మహిళలను వేధిస్తున్న సమస్య.. పీసీవోఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్). అధిక బరువు, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, మానసిక ఆందోళనలు, జన్యు సంబంధ సమస్యలు.. ఇలా పీసీవోఎస్ సమస్యకు చాలా కారణాలు. ఎన్ని మందులు వాడినా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే ఈ సమస్యకు సరైన పరిష్కారమనేది నిపుణుల మాట. ఈ సమస్యను అధిగమించే ఆహారాన్ని అందిస్తూ.. పీసీవోఎస్ బాధితురాలైన స్నిగ్ధ కుమార్ తన స్నేహితుడు శ్రీజిత్ వెంకటేశ్‌తో కలిసి ‘CORA’ అనే ఓ యాప్‌ని ప్రారంభించింది. వీరిద్దరిదీ బెంగళూరే. ఈ యాప్‌లో 200 రకాల ఆరోగ్యకరమైన పదార్థాలతో వండుకోవడానికి వీలున్న 3,000 రకాల వంటల వివరాలు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ పీసీవోఎస్ నుంచి ఒడ్డున పడటానికి ఉపకరించేవే. అధిక బరువు వంటి దీర్ఘకాలిక సమస్యనూ నియంత్రిస్తాయి. ఇందులో ముఖ్యంగా ఒంటెపాలతో చేసిన చాక్లెట్లు, బ్రౌన్ రైస్ కేక్స్, గ్లూటెన్ ఫ్రీ, ఆయిల్ ఫ్రీ స్నాక్స్, వాల్నట్స్ వంటల తయారీ విధానాలు ఉంటాయి. అంతేకాదు, ఈ యాప్ ద్వారా వైద్యుల సలహాలూ తీసుకోవచ్చు. ఇతరఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా తగిన డైట్స్ అందుబాటులో ఉంచారు.