
మెదక్/సంగారెడ్డి కలెక్టరేట్,డిసెంబర్ 16 : మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఓటరు నమోదు కోసం చేపట్టిన స్వీప్ కార్యక్రమాలు బాగున్నాయని ఎలక్టరోల్ పరిశీలకురాలు శైలజా రామయ్యర్ కితాబిచ్చారు. గురువారం మెదక్, సంగారెడ్డి కలెక్టరేట్లలో మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు హరీశ్, హనుమంతరావు, మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి 5వ తేదీన ఓటరు తుది జాబితా సందర్భంగా ఓటర్ల నమోదు, సవరణలు, తొలిగింపుపై తహసీల్దార్లు, బీఎల్వోలు ఎదుర్కొన్న ఇబ్బందులు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో చాలా మంది యువత ఆన్లైన్ ద్వారా ఓటరు నమోదు చేసుకున్నారని తెలిపారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని బ్లాక్‌స్థాయి అధికారులు గరుడ యాప్‌లో వివరాలు నమోదు చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటరు నమోదుకు ఆన్లైన్లో వస్తున్న దరఖాస్తులతో పాటు మాన్యువల్‌గా వస్తున్న దరఖాస్తులను కూడా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు ఫారం 6, తొలిగింపు ఫారం 8ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
మెదక్ జిల్లాలో 4,13,517 మంది ఓటర్లు : కలెక్టర్
మెదక్ జిల్లాలో 4,13,517 మంది ఓటర్లున్నారని కలెక్టర్ హరీశ్ తెలిపారు. 1 నవంబర్ 2021న డ్రాఫ్ట్ పబ్లికేషన్ నాటికి 2,917 మంది కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్నారని, కాగా 4,737 పేర్లు తొలిగించినట్లు చెప్పా రు. ఈ సంవత్సరం జనవరి 15న ఓటర్ల తుది జాబితా ప్రకటించే నాటికి 4,12,429 మంది ఓటర్లు ఉండగా, ఈ నవంబర్ 1కి 1,088 మంది ఓటర్లు పెరిగారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని మొత్తం 576 పోలింగ్ కేంద్రాల బ్లాక్ స్థాయి అధికారులు వందశాతం గరుడ యాప్ ద్వారా వివరాలు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఆర్డీవో సాయి రాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఓటర్ల నమోదు, సవరణలు, తొలిగింపులు తదితర దరఖాస్తులను పరిష్కరించినట్లు సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. జిల్లాలోని పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన అన్ని వివరాలను గరుడ యాప్‌లో నమోదు చేశామని, ఎలాంటి పెండింగ్ లేవని కమిషనర్‌కు వివరించారు. ఎలాంటి పెండింగ్ లేకుండా పరిష్కరించి ఓటర్ల జాబితాలను సిద్ధం చేయడంపై ఆమె అధికారులను అభినందించారు. సమావేశాల్లో స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, తహసీల్దార్లు, సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీఆర్వో రాధికా రమణి, బ్లాక్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.