అమరావతి : విజయవాడ కృష్ణలంకకి చెందిన గాదె సాయికృష్ణ ( Gade Saikrishna ) కనిపించకుండా పోవడంపై వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సాయికృష్ణను పోలీస్‌స్టేషన్‌లో హత్య చేసి ఆనవాళ్లు లేకుండా దహనం చేశారని పేర్కొన్నారు. కనీసం బూడిద లేకుండా మాయం చేశారని వెల్లడించారు.
సాయికృష్ణ మేనమామ నవరంగ్ జనసేన కార్యకర్త అని వివరించారు. అయితే తన మేనల్లుడు కనపించకపోవడంతో తనను సంప్రదించారని అన్నారు. సాయికృష్ణపై వస్తున్న అనుమానాలను జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) రాజకీయాలకు అతీతంగా స్పందించాలని కోరారు. దేశంలో ఎన్నో లాకప్ డెత్‌లు జరిగాయి. కానీ విజయవాడలో సాయికృష్ణను లాకప్‌డెత్ చేసి శవాన్ని మాయం చేశారని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో హెబియస్ కార్పస్ కేసు వేస్తే యువకుడి కోసం వెతుకుతున్నామని పోలీసులు దాటేవేసే దోరణిని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. సాయికృష్ణను లాకప్‌డెత్ చేశారు. సీబీఐ విచారణ వేసి న్యాయం చేయాలని, సాయికృష్ణను దహనం చేసి ఉంటే కనీసం బూడిదనైనా ఇవ్వమని సాయికృష్ణ తల్లి చేస్తున్న విజ్ఞప్తిని పట్టించుకోవాలని కోరారు. బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణపై ఏమైనా కేసులుంటే చట్టపరంగా శిక్షించాలని, చంపే హక్కు ఎవరిచ్చారని మేనమామ నవరంగ్ పోలీసులను ప్రశ్నించారు.