హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): కోమటిరెడ్డి గ్రూపులు సుమారు రూ.350 కోట్ల మేరకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేతకు పాల్పడినట్టు తెలుస్తున్నది. కోమటిరెడ్డి గ్రూపులకు చెందిన 16 వ్యాపార సంస్థలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ (ఎస్జీఎస్టీ) సోమవారం దాడులు జరిపింది. ప్రభుత్వానికి పన్నుల చెల్లింపులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయన్న సమాచారం మేరకు సీజీఎస్టీ తనిఖీలు చేపట్టింది. కోమటిరెడ్డి గ్రూపులకు చెందిన 16 వ్యాపార సంస్థలపై 150 మందితో కూడిన 25 బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఉదయం 11.30కి నుంచి రాత్రి 7 గంటల వరకూ సోదాలు కొనసాగాయి.
ఈ సందర్భంగా అధికారులు హార్డ్ డిస్క్‌లు, సీపీయూ, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కోమటిరెడ్డి గ్రూపు సంస్థల్లో సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్, సుశీ అరుణాచల్ హైవేస్ లిమిటెడ్, సుశీ చంద్రగుప్త్ కోల్‌మైన్స్ లిమిటెడ్ తదితర సంస్థలున్నాయి. వీటికి బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుమారుడు సంకీర్త్‌రెడ్డి ఎండీగా ఉన్నారు.
వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతు ప్రసాద్ నేతృత్వంలో ఆయా సంస్థల డైరెక్టర్ల ఇండ్లలో కూడా సోదాలు నిర్వహించారు. కోమటిరెడ్డి గ్రూపు సంస్థలు పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఈ తనిఖీల్లో వెల్లడైనట్టు సమాచారం. లెక్కల్లో చూపని వ్యాపార లావాదేవీలు భారీగానే జరిగాయని లభ్యమైన పత్రాల ద్వారా తెలిసింది. ఆ కంపెనీల్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లలో లభించిన సమాచారం ప్రకారం పలు అనుమానాస్పద లావాదేవీలు కూడా జరిగినట్టు గుర్తించారు.
ప్రాథమిక అంచనా ప్రకారం.. సుశీ గ్రూపుల సంస్థలు వందల కోట్ల పన్నుల ఎగవేతకు పాల్పడినట్టు వాణిజ్య పన్నుల శాఖ అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఒక సంస్థ కార్యాలయంలోని బీరువాలో ఉన్న లాకర్‌కు సీల్ వేశారు. ఇప్పటికే రూ.350 కోట్ల వరకు ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించిన అధికారులు.. మంగళవారం మరో ర్యాక్‌ను తెరవనున్నారు. ఈ పన్నుల ఎగవేతపై విచారణ, దర్యాప్తు కొద్దిరోజుల్లో పూర్తిస్థాయిలో ముగుస్తుందని వాణిజ్య పన్నుల శాఖ తెలిపింది. ఆ తర్వాత ఏ మేరకు పన్నుల ఎగవేత జరిగింది? ఇతర అక్రమాలు ఏమేమి జరిగాయన్న దానిపై స్పష్టత రానున్నది. మంగళవారం కూడా సోదాలు కొనసాగే అవకాశముంది.