తుంగతుర్తి, నవంబర్ 04 : తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రం నుండి సూర్యాపేటకు వెళ్లే ప్రధాన రహదారి, కల్వర్టు పూర్తిగా ధ్వంసమై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని బీజేపీ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబు డిమాండ్ చేశారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని సూర్యాపేట- తుంగతుర్తి ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ఈ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసి రెండేండ్లు గడుస్తున్నా పనులు మాత్రం పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలకుల నిర్లక్ష్యంతో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం పూర్తిగా అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆరోపించారు. రహదారి నిర్మాణం కోసం రూ.6 కోట్లు డ్రా చేసుకుని, కేవలం మోరీలు వేసి వదిలేశారని ఆరోపించారు. అతి త్వరలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు నాగరాజు, గాజుల మహేందర్, ఉప్పుల లింగయ్య, అంబటి రమేశ్, యల్లబోయిన భిక్షం, సుధాకర్, సాయికృష్ణ, బండి నవీన్ పాల్గొన్నారు.