Suryapet | తెలంగాణ సాయుధ పోరాటం, ఉద్యమకారులకు పుట్టినిల్లు, గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరి పోయడంతో పాటు అనేక ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన సూర్యాపేట నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో అధోగతిపాలైంది. స్వరాష్ట్రంలో 2014 తరువాత జరిగిన అభివృద్ధి నభూతో నభవిష్యత్ అన్న రీతిలో మంత్రి జగదీశ్‌రెడ్డికి ముందు, తరువాత అని చెప్పుకునేలా పట్టణం మారిందని స్థానికులు గర్వంగా చెబుతున్నారు.
1952లో ఏర్పాటైన సూర్యాపేట నియోజకవర్గం అన్ని పార్టీలకు ఆతిథ్యం ఇచ్చింది. 1952 నుంచి 1957 వరకు పీడీఎఫ్ గెలువగా, ఆ తర్వాత ఐదుసార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ విజయం సాధించాయి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ నుంచి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విజయం సాధించారు. తొమ్మిదిన్నరేండ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.7,500 కోట్లు ఖర్చు చేశారు. 2014 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్రావుపై, 2018లో మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డిపై జగదీశ్‌రెడ్డి విజయం సాధించారు.
అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న నియోజకవర్గాన్ని విద్యుత్ శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సారథ్యంలో ఇతర నియోజకవర్గాలతో పోటీ పడేలా అభివృద్ధి చేశారు. రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల, రాష్ట్రంలోనే ఏ పట్టణంలో లేని విధంగా రూ.42 కోట్లతో రెండు మినీ ట్యాంక్బండ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సద్దుల చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగా, ప్రస్తుతం పుల్లారెడ్డి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తున్నారు. మురుగు నీటి శుద్ధికి రూ.120 కోట్లు, పట్టణ అంతర్గత రోడ్లకు రూ.150 కోట్లు, మురుగు కాల్వలకు రూ.85 కోట్లు, రాష్ట్రంలోనే మోడల్‌గా నిలిచిన సమీకృత మాడల్ మార్కెట్‌కు రూ.31 కోట్లు, శ్మశానవాటికల అభివృద్ధికి రూ.15 కోట్లు, పట్టణ ప్రకృతి వనాలకు రూ.5 కోట్లు, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల్లో సుమారు రూ.80 కోట్లను వివిధ అభివృద్ధి పనులకు కేటాయించారు. జిల్లా కేంద్రంలో రూ.95 కోట్లతో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు నిర్మించారు. ఆటోనగర్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాట్లు జరుగుతున్నవి. గతంలో పట్టణంలో రెండు పార్కులు ఉండగా, ఇపుడు వాటి సంఖ్య 65కు చేరింది. వీధుల్లో ఓపెన్ జిమ్‌లు, జిగేల్మనిపించేలా విద్యుత్ వెలుగులు, చౌరస్తాల విస్తరణ, వాటర్ ఫౌంటెయిన్లు, వీధుల్లో గ్రీనరీని పంచుతున్న రకరకాల మొక్కలు, పట్టణం నడిబొడ్డు నుంచి శివారు ప్రాంతాల వరకు రహదారులు, మురుగు కాల్వలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఇలా ఎన్నో నిర్మించారు.
2014కు ముందు నియోజకవర్గంలో సాగు నీరు లేక 20 శాతం కూడా వరి సాగు కాలేదు. నేడు నియోజకవర్గానికి కృష్ణా, గోదావరి, మూసీ నీరు వస్తుండటంతో రికార్డు స్థాయిలో వరి పంట పండుతున్నది. నియోజకవర్గంలో 59,695 ఎకరాల భూమి ఉంటే.. గతంలో 15 వేల ఎకరాలకు మించి వరి సాగైన దాఖలాలు లేవు. నేడు వంద శాతం సాగులోకి వచ్చింది.
సూర్యాపేట పట్టణానికి హైదరాబాద్ మురుగు నీటిని తాపించిన ఘనత నాటి పాలకులది. సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథతో నియోజకవర్గంలో దాదాపు రూ.285 కోట్లు ఖర్చు చేసి నేడు ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. జిల్లా కేంద్రంతోపాటు 113 గ్రామ పంచాయతీలు, వాటి ఆవాసాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు.
– సూర్యాపేట, (నమస్తే తెలంగాణ)